కేటీఆర్‌పై ఎంపీ బాపురావు ఫైర్
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: ‘కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు’ అని విర్రవీగిన సీఎం కేసీఆర్‍కు రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీల గెలుపుతో వెన్నులో వణుకు మొదలైందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. కారు పంక్చర్ అయిందని, పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు తగిన గుణపాఠం తప్పదని చెప్పారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. సొంత చెల్లెల్ని గెలిపించుకోలేని దద్దమ్మ టీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసినా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని అసమర్థుడు ఎమ్మెల్యే జోగు రామన్న అని బాపూరావు విమర్శించారు.
‘‘చెల్లని రూపాయి అంటూ నన్ను విమర్శించిన జోగు రామన్న పట్టణంలో మంజూరైన ప్లై ఓవర్ బ్రిడ్జి, సీసీఐ పునరుద్ధరణ, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వేలైన్లకు రాష్ట్ర వాటాను తీసుకురావడంలో విఫలమై అసమర్థుడిగా నిలిచారు. మంత్రిగా ఆదిలాబాద్‍కు జోగు రామన్న చేసిందేమిలేదు” అన్నారు. వాటన్నింటినీ ఐదేళ్ల కాలంలో తాము పూర్తిచేస్తామని అందుకు టీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సహకరించకుంటే తుడుందెబ్బ, ఆదివాసీలతో కలిసి వారి ఇళ్లను ముట్టడించి ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చేస్తామని హెచ్చరించారు.