
భైంసా అల్లర్లలో హిందువులపై అక్రమ కేసులు సరికాదు
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
భైంసా, వెలుగు: పోలీసులు సీఎం కేసీఆర్‌కు జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. సోమవారం భైంసాలోని గణేశ్‌నగర్, కిసాన్ గల్లీ, కోర్భగల్లీ, బైల్ బజార్, బస్టాండ్ ఏరియా ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు. భైంసా అల్లర్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులను సోమవారం ఎంపీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తరచూ ఈ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతున్నాయని, ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయనే దానిపై పూర్తి విచారణ చేయడం లేదన్నారు. పోలీసులు నేరస్థులను వదిలేసి అమాయకులను అరెస్టు చేసి జైలుకు పంపడం కరెక్ట్ కాదన్నారు. కత్తి పట్టిన వారిపై కేసులు పెడితే మంచిదన్నారు. లాక్‌డౌన్‌వల్ల బాధితులను కలవడం లేట్అయ్యిందని, త్వరలోనే జైలులో ఉన్నవారికి బెయిల్వస్తుందని చెప్పారు. భైంసాలోని ఓ వర్గానికి చెందిన పార్టీ ఓట్ల కోసమే మత ఘర్షణలకు కారణమవుతోందని ఎంపీ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయని చెప్పారు. గొడవలు జరిగిన ప్రతిసారి హిందువులే బలవుతున్నారన్నారు. నక్సలైట్లు, టెర్రరిస్టులపై పెట్టే పీడీ యాక్టులు అమాయకులపై ప్రయోగించడం దారుణం అన్నారు. ఆర్మీకి సెలెక్ట్అయిన యువకుడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని, అతని భవిష్యత్ ఖరాబ్ చేశారని మండిపడ్డారు. అనంతరం 30 బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, స్థానిక నాయకులు ఉన్నారు.