ప్రభుత్వానికి రెవెన్యూ, ఫారెస్ట్ భూమి ఎక్కడుందో కూడా తెలియదు

  •  మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎంపీ సోయం బాపురావు ఫైర్ 
  • కమీషన్ల కోసం ‘పాలమూరు’ డిజైన్ మార్చిన్రు: డీకే అరుణ  

మహబూబ్​నగర్, వెలుగు: కేంద్ర మంత్రి అర్జున్ ముండాపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శలు చేయడం సరికాదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మహబూబ్​నగర్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధాలను నిజం చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ఏడాది టైం ఉన్నా.. బీఆర్ఎస్ లీడర్లు భయపడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘పోడు పట్టాలిస్తామని మీరే చెబుతరు.. ఇంకోసారి మేమే ఇయ్యాలని అంటరు..” ఈ విషయంపై మీకే క్లారిటీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ, ఫారెస్ట్ భూమి ఎక్కడుందో కూడా తెలియదన్నారు. కేవలం రాజకీయాల కోసమే కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీని ఆదిలాబాద్​కు మంజూరు చేస్తే, రాష్ర్ట ప్రభుత్వం ములుగు జిల్లాకు తీసుకెళ్లిందని, ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ఇద్రకరణ్​రెడ్డే పోడు పట్టాలు ఇవ్వాలని, అది మరిచిపోయి తన మీద నిందలు వేస్తున్నారని తప్పుపట్టారు.    

పేద రైతుల కష్టం దోచుకుంటున్రు.. 

రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి పాలమూర్– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ను మార్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని దోచుకొని, వారిని రోడ్డు పాలు చేస్తోందని విమర్శించారు. వంద ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చి.. పేద రైతుల కష్టాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్​అయ్యిందన్నారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 6,650 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, సీఎం స్పందించడం లేదన్నారు. 'అబ్ కీ బార్ కేసీఆర్ ముక్త్' అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.