ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల కోసం..మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం..

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే వేడుకలకు రావాలంటూ మున్సిపల్ కమిషనర్ కింది ఉద్యోగులకు హుకూం జారీ చేశారు. మున్సిపల్ , మెప్మా సిబ్బంది బర్త్ డే వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఆదేశాలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

జులై 4వ తేదీన ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగు రామన్న బర్త్ డే. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఆదిలాబాద్ మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో  చేస్తున్నామని జులై3వ తేదీ మున్సిపల్ కమిషనర్ కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. 

ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలకు రావాలంటూ మున్సిపల్ కమిషనర్ కిందిస్థాయి ఉద్యోగులను ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధి పుట్టిన రోజు వేడుకలను కమిషనర్ భుజాన ఎత్తుకుని చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు ముఖ్యమయ్యాయయని నిలదీస్తున్నారు. 

గతంలో బెల్లింపల్లి మున్సిపల్ కమిషనర్ కూాడ ఇదే విధంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. కేటీఆర్ బర్త్ డే కు రాలేదని బెల్లింపల్లి కమిషనర్ కిందిస్థాయి ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.