ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పనులు ఆపాలని తాంసి బస్టాండ్ప్రాంత వ్యాపారులు రెండ్రోజుల క్రితం కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో పనులు నిలిపివేశారు.
దీంతో సోమవారం స్థానిక పంజాబ్ చౌక్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఆయా కాలనీల వాసులు రాస్తారోకో చేపట్టారు. తాము దశాబ్దాలుగా రైల్వే గేట్తో నరకం అనుభవిస్తున్నామని.. ఇపుడు తమ సమస్య పరిష్కారమయ్యేలా బ్రిడ్జి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యాపారులు అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో బ్రిడ్జ్ నిర్మాణంలో జాప్యం జరిగిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. వ్యాపారులు సైతం ఆందోళన చేస్తుండడంతో వారిని సముదాయించి అభివృద్ధి పనులకు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.