పులుల రక్షణకు.. రంగంలోకి పోలీసులు

అటవీశాఖతో జాయింట్​ ఆపరేషన్

ఆదిలాబాద్,​ వెలుగు: వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ఆర్మ్​డ్​ రిజర్వ్​ పోలీసులతో కలిసి రంగంలోకి దిగారు.. మహారాష్ట్రలోని తాడోబ నుంచి కవ్వాల్​ అటవీ రేంజ్​లోకి వస్తున్న పులులను కాపాడేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. టైగర్​జోన్​లో రెండు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ వేటగాళ్ల ముఠా గురించి ఆరా తీస్తున్నారు. కారిడార్​ దాటుతున్న సమయంలో వేటగాళ్లు పొంచి ఉండి పులులను వేటాడుతున్నారని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ (డబ్ల్యూసీసీబీ), ఎన్​టీసీఏ బృందాలు హెచ్చరించాయి.

‘కవ్వాల్​ టైగర్​జోన్​లో వేటగాళ్లు’ పేరట వెలుగు ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్మగ్లర్లు, వేటగాళ్లను పట్టుకునేందుకు సరిహద్దుల్లో నిఘా వేశారు. సిర్పూర్​ టి, వాంకిడి, కెరమెరి అడవుల్లో పోలీస్, అటవీశాఖ బలగాలు మోహరించి, ఉమ్మడి జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. ఇచ్చోడ, ఖానాపూర్, పెంబి రాజురా బోథ్​, మామడ, సారంగాపూర్, దస్తురాబాద్, జన్నారం ప్రాంతంలోని కవ్వాల్ అభయారణ్యంలో అధికారులు నిఘా పెంచారు.