బీఆర్ఎస్ నేతల మధ్య విభేధాలు.. అయోమయంలో కార్యకర్తలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఎంపీపీ తుల శ్రీనివాస్ లు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండటంతో  విభేదాలు వెలుగులోకి వచ్చాయి. తమ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ఎంపిపి తుల శ్రీనివాస్ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకే ఊర్లో వేరువేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండటంతో ఏ సమ్మేళనానికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ సమ్మేళనానికి వెళ్తే..ఎంపీపీ తుల శ్రీనివాస్ తో  ఇబ్బంది. ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తే..ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో సమస్య. దీంతో బోథ్ లో ..బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి..ముందు చూస్తే నుయ్యి..వెనకకు వెళ్తే గొయ్యి అన్న చందంగా మారింది. 

 

ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..

బోథ్ బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలపై ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఎంపిపి తుల శ్రీనివాస్ వర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని చెప్పారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇతర నాయకులు సభలు జరిపినా....వ్యతిరేకంగా పని చేసినా.. పార్టీ పరిగణలోకి తీసుకోదన్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెళ్లే నాయకులకు పార్టీ సహకరించదని తెలిపారు. ఎమ్మెల్యేల ఆత్మీయ సమ్మేళనాల్లోనే కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.