
- 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా
- జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల ఏర్పాటు
- ఎకరానికి 8.65 క్వింటాళ్ల పరిమిత కొనుగోళ్లపై ఆందోళన
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో జొన్న పంట సాగైంది. గతంలో ఎన్నడు లేనవిధంగా ఈసారి లక్ష ఎకరాల్లో సాగు చేయడం విశేషం. గతేడాది యాసంగిలో జిల్లా రైతులు 70 వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ఈ ఏడాది 40 వేల ఎకరాలు పెరిగి 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో పంట దిగుబడి సైతం భారీగా పెరిగింది. ఎకరానికి 15 క్వింటాళ్లు వస్తుందని, జిల్లా వ్యాప్తంగా 17 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్వింటాల్‌కు రూ.3,771 మద్దతు ధర
జిల్లాలో చాలా మంది ఏటా పత్తి పంట తీసిన వెంటనే యాసంగిలో జొన్న, శనగ, మొక్కజొన్న సాగు చేస్తారు. అయితే ఈసారి శనగ పంట సాగు తగ్గించిన రైతులు జొన్న సాగు చేసేందుకు మొగ్గు చూపారు. పంట ఆశాజనకంగా ఉంది. 50 శాతం మంది రైతులు పంట కోసి అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్వింటాళుకు మద్దతు ధర రూ.3,771 ప్రకటించిన ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా మొత్తం13 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ధన్నోర, సిరికొండ, ఇంద్రవెల్లి, శాంపూర్, హస్నాపూర్, నార్నూర్ లో కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం బోథ్, ధన్నోర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
కలెక్టర్ ఆదేశాలు
కొనుగోళ్లపై మంగళవారం కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి జిల్లాకు అక్రమంగా జొన్న పంట రవాణా చేయకుండా చర్యలు చేపట్టాలని, బార్డర్ చెక్ పోస్టులో విజిలెన్స్ టీమ్ ఏర్పాటు చేసి సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా జొన్న రాకుండా అరికట్టాలని ఆదేశించారు.
పరిమిత కొనుగోళ్లతో పరేషాన్
జొన్న పంట కొనుగోళ్లపై నిబంధనలు విధించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 8.65 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఎకరాకు 10 నుంచి15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, మిగతా పంట పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు. పంట మొత్తం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది.
రికార్డు స్థాయిలో జొన్న సాగైంది
ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో జొన్న పంట సాగు చేశారు. గతేడాది 70 వేల ఎకరాల్లో సాగవగా 40 వేల ఎకరాలు పెరిగి 1.10 లక్షలకు చేరుకుంది. పంట దిగుబడి 17 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేశాం. కొనుగోళ్లు సైతం ప్రారంభిస్తున్నాం.– శ్రీధర్ స్వామి, వ్యవసాయ శాఖ అధికారి
మండలాలు జొన్న పంట సాగు (ఎకరాల్లో)
ఆదిలాబాద్ రూరల్ 11,135
ఆదిలాబాద్ అర్బన్ 181
బేల 5880
జైనథ్ 17,638
మావల 705
బజార్హత్నూర్ 6699
బోథ్ 11,496
నేరడిగొండ 6564
గుడిహత్నూర్ 3510
ఇచ్చోడ 5815
సిరికొండ 1754
భీంపూర్ 3419
తలమడుగు 10,407
తాంసీ 7652
గాదిగూడ 1539
ఇంద్రవెల్లి 6388
నార్నూర్ 4075
ఉట్నూర్ 6667