కొలువులు ఇస్తమంటేనే భూములిచ్చినం..రేణుక  సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో జాప్యం చేయొద్దు 

కొలువులు ఇస్తమంటేనే భూములిచ్చినం..రేణుక  సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో జాప్యం చేయొద్దు 
  •    పిల్లలకు జాబ్ లు వస్తయనే తక్కువ ధరకు అమ్ముకున్నం  
  •    పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో భూ నిర్వాసితులు ఆవేదన

ఆదిలాబాద్, వెలుగు: సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం లేటవుతుండగా తాము ఇబ్బందులు పడుతున్నామని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీలుగా మారి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. గురువారం  ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి సమీపం లో రేణుక ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రా య సేకరణ చేపట్టారు.

ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులు హాజరై అభిప్రాయాలను తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మిస్తామంటే భూములను తక్కువ ధరకు అమ్ముకున్నామన్నారు. తమ పిల్లలకు జాబ్ లు ఇస్తామంటేనే ఇచ్చామన్నారు. ఇప్పుడు  ఫ్యాక్టరీ నిర్మించకపోతుండగా ప్రైవేట్ జాబ్ లు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మరికొందరు రైతులకు పరిహారం డబ్బులు రావాల్సి ఇంకా ఉందన్నారు. సిమెంట్‌‌ఫ్యాక్టరీ యజమాన్యం, అధికారులు స్పందించి ఇప్పటికైనా నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి ఉపాధి, జాబ్ లు  కల్పించాలని,  అంతేకాకుండా తమ భూముల ధరలను పెంచి ఆదుకోవాలని కోరారు. 

ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఉద్యోగాలు అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే చాలా మందికి యువతకు జాబ్ లు వస్తాయని అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ఎలాంటి సందేహాలున్న ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు రావాల్సి ఉందని,  రాగానే వచ్చే ఏడు నెలల్లోపు ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని కంపెనీ డైరెక్టర్‌‌ జీవికే ప్రసాద్‌‌ పేర్కొన్నారు.

  భూములు కోల్పోయిన వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌‌కుమార్, డీఎస్పీ జీవన్‌‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్‌‌ లక్ష్మణ ప్రసాద్, మైనింగ్‌‌ జనరల్‌‌ మేనేజర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి, రేణుకా సిమెంట్‌‌ స్పెషల్‌‌ ఆఫీసర్‌‌ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.