ఆదిలాబాద్ ను టూరిజంగా ప్రమోట్ చేయాలి

ఆదిలాబాద్/ బాసర, వెలుగు: స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు త్వరలో ఆదిలాబాద్​లో ఐదు ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని, కానీ ఆదిలాబాద్​ను కూడా ఐటీ మ్యాప్ లో కేసీఆర్​ పెట్టారని ఆయన చెప్పారు. కేసీఆర్ దార్శనికతతో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పట్టణాల్లోని యువతకు చాన్స్​ ఇస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలతో పోటీ పడతారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే జోగురామన్న తల్లి చనిపోవడంతో సోమవారం ఆదిలాబాద్​ జిల్లా  దీపాయిగూడలోని ఆయన ఇంటికి కేటీఆర్​ వెళ్లి పరామర్శించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకొని.. ఐటీ టవర్​ను సందర్శించారు. బీడీఎన్టీ ల్యాబ్స్ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్​ మాట్లాడారు. ఆదిలాబాద్​లో మూతపడ్డ సీసీఐని తెరిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని, కొత్త యూనిట్ పెడితే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అవన్నీ ఇచ్చేందుకు  సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆదిలాబాద్ ను టూరిజంగా ప్రమోట్ చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కేటీఆర్​ కోరారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ

ఆదిలాబాద్​లో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఐటీ టవర్ సందర్శనకు వచ్చిన ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. కానీ, అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వారు ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్థానికత పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో తమ స్థానికతను ప్రశ్నార్థకం చేసిన జీవో 317 ను పునః సమీక్షించాలని డిమాండ్​ చేశారు. 

బీజేపీ నేతల అరెస్ట్

బాసర ట్రిపుల్ ఐటీ సందర్శనకు మంత్రి కేటీఆర్​వస్తున్నారని తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు మెయిన్​గేట్​ వద్దకు చేరుకొని మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు ఆందోళన చేసి మూడు నెలలు గడిచిన తర్వాత మంత్రికి ఇప్పుడు తీరిందా? అంటూ వారు ప్రశ్నించారు. అక్కడే కేటీఆర్​రాక కోసం ఎదురుచూస్తున్న టీఆర్​ఎస్​ నేతలు ప్రతినినాదాలు చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.