సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత..అత్యవసర పోస్టుల భర్తీలో అలసత్వం

  •     ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్న కార్మిక కుటుంబాలు 
  •     స్పెషలిస్టులు వెళ్లిపోతుండ్రు కొత్త వారు వస్తలేరు. 

కోల్​బెల్ట్​, వెలుగు: రామకృష్ణాపూర్, బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రామకృష్ణాపూర్ ​ఆసుపత్రిలో  సుమారు 40 మంది డాక్టర్లు ఉండాలి. ప్రస్తుతం అయిదుగురు పర్మినెంటు వైద్యులు, మరో ముగ్గురు కాంట్రాక్ట్​ డాక్టర్లు మాత్రమే  విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషీయన్, ఆర్థో సర్జన్, కార్డియోలజిస్టు, న్యూరో సర్జన్, యూరాలజిస్టు,  ఈఎన్​టీ, ఆప్తమాలజిస్టు, రేడియాలజిస్టు డాక్టర్లు లేరు.  ముగ్గురు గైనిక్​ డాక్టర్లకు, ఇద్దరు అనస్థీషియాకు ఒకరు మాత్రమే ఉన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు ఉండాలి. ప్రస్తుతం గైనిక్​, ఆర్థో, అనస్థీషియా డాక్టర్లతోపాటు ఎనిమిది మంది ఎంబీబీఎస్​, ఇద్దరు కాంట్రాక్ట్​ వైద్యులు మాత్రమే ఉన్నారు.  కొవిడ్​ కాలం నుంచి ఇక్కడి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయడం లేదు.  ఏరియా ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న 7 డిస్పెన్సరీల్లో  కూడా డాక్టర్ల కొరత  తీవ్రంగా ఉంది. 

అత్యవసరమయ్యే డాక్టర్లు పోస్టుల భర్తీలో అలసత్వం నెలకొంది.  మరోవైపు స్పెషలిస్టు డాక్టర్లుగా విధుల్లో చేరిన వారు వివిధ కారణాలతో కొద్ది కాలానికే సింగరేణిని విడిచి వెళ్తున్నారు.  వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. రెండు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ఉండాల్సిన స్పెషలిస్టు  డాక్టర్లు ఇద్దరు ముగ్గురికే పరిమితమయ్యారు.  కొవిడ్ తర్వాత కార్పొరేట్​ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టులు  కన్సల్టెంట్​ పద్ధతిలో వచ్చి ట్రీట్​మెంట్ అందించే విధానం కూడా నిలిచిపోయింది.  అయిదు ఓసీపీలు,13 అండర్​ గ్రౌండ్​ మైన్లు, డిపార్ట్​మెంట్లు, జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డు కార్మికులు, కాంట్రాక్ట్​ కార్మికులు కలిపి మొత్తంగా 1.5 లక్షల మందికి ఈ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాల్సి ఉండగా..  సేవలు అందక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. 

బెల్లంపల్లి రీజియన్​ పరిధి మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ ఏరియా ఆసుపత్రి కీలకం. 150 బెడ్స్​ కెపాసిటీ ఉన్న ఆసుపత్రికి  ప్రతి రోజూ మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాలకు చెందిన  సుమారు 1,500 మంది పెషేంట్లు  వైద్యం కోసం వస్తుంటారు.  పీజీ విద్య కోసం, ప్రభుత్వ వైద్య విద్య కాలేజీల్లో అసిస్టెంట్​ ప్రొఫెసర్ల పోస్టులకు సెలెక్ట్​ అయిన ఆసుపత్రి స్పెషలిస్టులు, జనరల్​ డాక్టర్లు, ట్రాన్స్​ఫర్​, ఇతర కారణాలతో ఇటీవల పలువురు ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిని విడిచి ఇతర ఆసుపత్రులకు వెళ్లిపోయారు. 

కార్మిక కుటుంబాలకు అందని వైద్యం 

డాక్టర్ల కొరత, దవాఖాన్లపై నిర్లక్ష్యంతో సింగరేణి కార్మికులకు మాములు ట్రీట్​మెంట్​ కూడా అందడం లేదు.  మేనేజ్​మెంట్​ ఏటా వైద్యం కోసం రూ.259   కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా...  రోగులు క్వాలిటీ ట్రీట్​మెంట్​ పొందలేకపోతున్నారు.  సింగరేణిలో 'సూపర్' స్పెషాలిటీ హాస్పిటల్​ కలగానే మారింది.  సింగరేణి వ్యాప్తంగా సరిపడా డాక్టర్లు, స్పెషలిస్టు డాక్టర్లు లేక హైదరాబాద్ కు పరుగులు తీయాల్సి వస్తోంది.