సంస్కృతిని కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదగాలి : ఎస్పీ అఖిల్​ మహాజన్​

సంస్కృతిని కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదగాలి :  ఎస్పీ అఖిల్​ మహాజన్​
  • ఆదివాసీలకు అండగా పోలీసులు

గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీలు తమ సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆదిలాబాద్​ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఆదివాసీల్లోని తొమ్మిది తెగల పెద్దలు, రాయి సెంటర్‌ పెద్దలు, నాయకులతో మంగళవారం ఉట్నూర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్పీ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ప్రాముఖ్యత, విశిష్టతను తాను తెలుసుకున్నానని, ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వాటిని కాపాడుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. తాము ఎదుర్కొనే సమస్యలు తనకు తెలియజేయాలని, సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. 

ఆదివాసీ యువత కోసం జాబ్‌ మేళాలు, లైసెన్స్‌ మేళాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీని ఆదివాసీ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌ సింగ్, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, తుడుందెబ్బ రాష్ట్ర నేత గొడం గణేశ్, జిల్లా సార్‌మేడీ మెస్రం దుర్గు పటేల్, నాయకులు మెస్రం మనోహర్, కేస్లాపూర్‌ ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, సార్‌మేడీలు, పటేల్‌లు, తొమ్మిది తెగల నాయకులు, పోలీసులు పాల్గొన్నారు.