- పుష్య, మాఘ మాసాల్లో రెండు నెలలు వరుసగా జాతర్లు
- నాగోబా జాతరలో భాగంగా ఇప్పటికే గంగా జల పాదయాత్ర షురూ
- త్వరలో ఖందేవ్, జంగుబాయి, సదల్పూర్, బుడుందేవ్, మహాదేవ్ జాతర్లు
ఆదిలాబాద్, వెలుగు : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో జాతర్లకు టైమొచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఆదివాసులు పుష్యమాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. వానాకాలం పంటలు చేతికొచ్చాక పుష్య, మాఘ మాసాల్లో రెండు నెలల పాటు వరుసగా జాతర్లు చేసుకుంటూ ఇష్టదైవాలను ఆరాధిస్తుంటారు. పొలిమేర పండుగతో పాటు దేవతలైన నాగోబా, పెర్సపేన్, భీందేవర, జంగూబాయికి పూజలు చేస్తారు. ఈ జాతర్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఆదివాసులు అధిక సంఖ్యలో
తరలివస్తుంటారు.
షురువైన నాగోబా జాతర సందడి
మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో మెస్రం వంశీయులు గంగా జలం కోసం ఇప్పటికే జన్నారం మండలం కలమడుగులోని గోదావరి నదికి తరలివెళ్లారు. ఈ నెల17న గంగా జలం తీసుకుని 25న కేస్లాపూర్‌కు చేరుకుంటారు. అక్కడ మూడు రోజులు తూమ్ పూజలు చేసిన అనంతరం 28న రాత్రి 10 గంటల తర్వాత నాగోబా ఆలయానికి వస్తారు.
అక్కడ ప్రత్యేక పూజలు చేసి జాతరను మొదలుపెడతారు. జాతరలో భాగంగా కొత్త కోడళ్లు బేటింగ్ కావడం ఇక్కడి ప్రత్యేకత. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతర్లో చివరి రోజు ప్రజాదర్బార్ నిర్వహించి ఆదివాసుల నుంచి వినతులు తీసుకుంటారు. నాగోబా జాతర ముగిశాక మెస్రం వంశీయులే ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతర ముగిశాక సిర్పూర్ (యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతరను నిర్వహిస్తారు. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలుస్తారు. ఈ జాతర15 రోజుల పాటు కొనసాగుతుంది.
కెరమెరి మండలంలో గుట్టలోని గుహలో పెద్దపులికి..
కెరమెరి మండలం మహారాజ్‌గూడ సమీప సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో జంగుబాయి వెలిసింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ జాతర 28 వరకు కొనసాగుతుంది. ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. గుట్టలోని గుహలో ఉండే పెద్దపులికి ‘జంగో లింగో’ అంటూ జై కొడుతూ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దీపమే దేవతగా దర్శనమిస్తుంది. ఎనిమిది గోత్రాల కటోడాల పూజరులు దీపారాధన చేస్తారు.
తొడసం వంశీయుల ఆధ్వర్యంలో...
నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ప్రారంభమైన ఖాందేవ్ జాతర ఈ నెల27 వరకు కొనసాగుతుంది. తొడసం వంశస్తుడైన ఖమ్ము పటేల్‌కు ఖాందేవుడు కలలో కనిపించి వ్యవసాయ భూమిలో కొలువయ్యాను, తనను కొలవాలని చెప్పాడని, మరుసటి రోజు పొలంలో చూడగా ఓ స్తంభంలా దేవుడు వెలిసి దర్శనమిచ్చాడని చెబుతుంటారు. అప్పటి నుంచి ఏటా పుష్య పౌర్ణమిలో తొడసం వంశీయులు ఖాందేవుడి జాతరను నిర్వహించుకుంటున్నారు. తొడసం ఆడపడుచుతో రెండు కిలోల నువ్వుల నూనెను తాగించడం ఇక్కడి ఆనవాయితీ.
సదల్పూర్‌లో బైరందేవ్, మహాదేవ్
బేల మండలం సదల్పూర్‌లో 54 ఏండ్ల నుంచి బైరందేవ్, మహాదేవ్ జాతర్లను నిర్వహిస్తున్నారు. వీటిని శాతావాహనుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఏదైనా కోరిక కోరుకొని బైరందేవ్ ఆలయంలోని శివలింగాన్ని పైకి ఎత్తాలి. కోరిక నెరవేరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుంది.. లేదంటే ఎటు కదలకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ జాతర్లు 23న ప్రారంభమై 29న ముగుస్తాయి. ఇక్కడ కేవలం కోరంగే వంశీయులే పూజలు ప్రారంభిస్తారు. వారం పాటు జరిగే జాతర్లు అమావాస్య రోజున ‘కాలదహి హండి’ కార్యక్రమంతో ముగుస్తాయి.