- జాండీస్ వచ్చినా దవాఖానలో చేరలేకపోయిన గిరిజనుడు
- ఎడ్లబండిలో వాగులోంచి శవాన్ని తీసుకెళ్లిన బంధువులు
ఉట్నూర్, వెలుగు: అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో వర్షాలకు వాగులు పొంగుతుండడంతో గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు. ఆప్తులు కన్నుమూసి శ్మశానానికో, ఇంటికో తీసుకెళ్లాల్సి వస్తే శవాలను పట్టుకుని వాగుల్లో ప్రమాదభరితంగా ప్రయాణించాల్సి వస్తున్నది. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ దమ్మన్నపేటకు చెందిన ఆదివాసీ గిరిజన యువకుడు ఆడ మారుతి(35)కి వారం క్రితం జాండీస్ (పచ్చకామెర్లు) బారిన పడడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని అనుకున్నారు. అప్పటికే భారీ వర్షాల కారణంగా సమీపంలో ఉన్న వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో నిస్సహాయ స్థితిలో ఇంటిదగ్గరే ఉంచారు. మంగళవారం వ్యాధి ముదరడం వాగు కూడా కొంత శాంతించడంతో అతికష్టం మీద రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. దీంతో డెడ్‌బాడీని ప్రైవేటు జీపులో నర్సాపూర్ వాగు వరకు తీసుకువచ్చారు. వాగు ఉధృతితో దాటే అవకాశం కనిపించకపోవడంతో ఊరిలోని బంధువులకు సమాచారమిచ్చి ఎడ్ల బండిని తెప్పించారు. అందులో శవాన్ని పడుకోబెట్టి దాటించారు. మృతుడికి భార్య, కొడుకు, ఇంకా పేరు పెట్టని చిన్నపాప ఉందని అతడి సోదరుడు తెలిపాడు.