
బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ చిత్రం 34 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్ మిక్స్‌తో ఈనెల 4న విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు అప్పటి ఈ సినిమా మేకింగ్ విశేషాలను గురించి ఇలా మాట్లాడారు.
ఓసారి బెంగళూరు ఫ్లైట్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ట్రావెల్ చేస్తూ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పా. ఆయన ఎక్సైట్ అయ్యి తప్పకుండా చేయాలంటూ ఇద్దరు, ముగ్గురు పెద్ద నిర్మాతలకు చెప్పారు. కానీ వాళ్లకు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అర్థం కాలేదు. కానీ బాలు గారు కథను బాగా నమ్మి కృష్ణ ప్రసాద్ గారికి చెప్పగా, ఆయన ఇందులో ఏదో ఉందనే గుడ్డినమ్మకం, గట్ ఫీలింగ్‌తో ముందుకొచ్చారు.
జంధ్యాల గారు డైలాగ్స్ కూడా రాశాక పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌కు కనెక్షన్ లింక్ లేదనిపించింది. అప్పుడే రాయలవారి కాలం నాటి వజ్రాన్ని వర్తమానం, భవిష్యత్తుతో ముడిపెట్టి స్క్రిప్ట్ పూర్తి చేశాం. ‘మహామంత్రి తిమ్మరుసు’కి స్క్రిప్ట్‌లోనూ ఇన్వాల్వ్ అయ్యాను కనుక ఆ కాలాన్ని ఎంచుకున్నా. రామారావు గారు పోషించిన రాయల పాత్రలో రాణించడం బాలకృష్ణకే సాధ్యమని ఆయనకు చెప్పడం, వెంటనే ఒప్పుకోవడం జరిగింది.
శ్రీకృష్ణదేవరాయల పాత్రకు ఫస్ట్ ఛాయిస్ బాలకృష్ణ గారే. ఇప్పటికీ ఆ పాత్రలో మరొకరిని ఊహించలేను. హీరోయిన్‌గా విజయశాంతి గారిని అనుకున్నాం. ఆమె కూడా ఎక్సైట్ అయ్యారు. కానీ కాల్షీట్లు సెట్ కాలేదు. అప్పటికే తమిళంలో రెండు సినిమాలు చేసిన మోహినిని ఆడిషన్ చేసి తీసుకున్నాం. అలాగే ప్రొఫెసర్ పాత్రకు టినూ ఆనంద్ బాగుంటారని ఆయన్ను తీసుకున్నాం. ఇక రెగ్యులర్‌గా భయపెట్టే విలన్ కాకుండా పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా విలన్ పాత్రను డిజైన్ చేసి, అమ్రీష్‌పురిని ఎంచుకున్నాం. 110 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం.
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజా గారిని అనుకోగా సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే కెమెరామెన్స్ మాత్రం ముగ్గురు పనిచేయాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత పీసీ శ్రీరామ్ గారు జబ్బు పడడంతో, విఎస్‌ఆర్ స్వామి గారితో రాయల ఎపిసోడ్స్ తీశాం. ఆయన డేట్స్ అయిపోవడంతో భవిష్యత్తు ఎపిసోడ్స్ కబీర్ లాల్ తీశారు.
టైమ్ మెషిన్ సెట్ రియల్‌గా ఉండాలని ముందుగా స్కెచెస్ వేసి, చిన్న సైజులో మెషిన్ మోడల్ చేశారు పేకేటి రంగా. అది ఓకే అనుకున్నాక పెద్దగా తయారు చేశారు. మెషిన్ తిరగడానికి మోటార్, స్మోక్ రావడానికి గ్యాస్ వంటివి ఏర్పాటు చేయడంతో స్క్రీన్‌పై రియల్ ఫీల్ కలిగించింది. అలాగే రాయల వారి సెట్ కూడా ఆయనే డిజైన్ చేశారు.
దీనికి సీక్వెల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాం. సీక్వెల్‌తో బాలకృష్ణ గారు వాళ్లబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు కానీ కుదరలేదు. ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని బాలయ్య అంటుంటారు. అది ఎప్పుడనేది దైవ నిర్ణయం.