సూర్యునిపై పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ గురించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఆదిత్య L1 మిషన్ సూర్యునిపై పరిశోధనలో గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపింది. లెగ్రాంజ్ పాయింట్ 1 చేరుకునే క్రమంలో ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌకలోని పేలోడ్ లలో ఒకటైన హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్టో మీటర్(HEL1OS) మొదటి పరిశీలన కాలంలో సౌరమంటలు సంభవించి దశను విజయవంతంగా రికార్డ్ చేసింది.
సూర్యుని ఉపరితలం, బాహ్య వాతావరణ నుంచి ఎక్స్ రే కిరణాలు, అతి నీల లోహిత కిరణాల కాంతి రూపంలో ఉద్భవించే శక్తి, రేడియేషన్ తో ఆకస్మికంగా తీవ్రమైన పేలుడు సంభవించడంతో వచ్చేవి సౌర మంటలు.సూర్యుని వాతావరణంలో నిల్వ చేయబడిన అయస్కాంత శక్తిని విడుదల చేయడం వల్ల సౌర మంటలు ఏర్పడతాయి.
హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్టో మీటర్(HEL1OS) పరికరం ISRO బెంగుళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ అభివృద్ది చేసింది. ఇది సూర్యుడి నుంచి అధిక శక్తితో కూడిన ఎక్స్ రే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రూపొందించబడింది. సుమారు పది గంటల పాటు కొనసాగిన ఈ పరికరం మొదటి పరిశీలనలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేనేషన్ కు చెందిన జియో స్టేషనరీ ఎన్విరాన్ మెంటల్ శాటిలైట్స్ (NOAA's GOES) అందించిన ఎక్స్ రే లైట్ కర్వ్లకు అనుగుణంగా డేటాను HEL1OS సంగ్రహించింది.
సౌర జ్వాలల అధ్యయనంలో భారత్ సామర్థ్యంలో ఈ విజయం ఓ ముఖ్యమైన ముందుడుగును సూచిస్తోంది. ప్రస్తుతం HEL1OS థ్రిషోల్డ్స్, కాలిబ్రేషన్ ఆపరేషన్స్ ఫైన్ ట్యూనింగ్ ఉంది. ఇది పూర్తి చేసిన తర్వాత సూర్యుని సంక్లిష్ట ప్రక్రియలపై అవగాహన, సౌర మంటల ఉత్పత్తి, పరిణామంపై లోతైన విశ్లేషణనను పరిశోధకులకు అందిస్తుంది.