భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నది. అగ్ని నక్షత్రమైన ఆదిత్యుడిపై అధ్యయనం చేయడానికి జరిపిన ప్రయోగం విజయవంతం కావడం అంత్యంత హర్షదాయకం, ప్రశంసనీయం. ఇప్పటికే చంద్రయాన్- 3 విజయవంతం కావడంతో భారత ఖ్యాతి ప్రపంచంలో మార్మోగింది. అసాధ్యమనుకున్న చోట సుసాధ్యం చేసి నిజమైన భారతీయ ప్రతిభకు ప్రతీకగా మారిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్, నెలవంకపై ప్రజ్ఞాన్ రోవర్ విజయ దరహాసం చేస్తూ, భారత అంతరిక్ష పరిశోధనలకు ఉత్తేజాన్ని కలుగచేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారతీయ అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమై, ఇప్పటి వరకు ఏది నిజమో, ఏది కల్పితమో అర్థంకాని స్థితిలో ఉన్న ప్రపంచ ప్రజలకు చంద్రుడి గురించిన పలు రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తూ భవిష్యత్తులో వెండి వెన్నెలను ధరిత్రిపై కురిపిస్తున్న జాబిల్లిని సామాన్యుడి చెంతకు చేర్చే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదు.
ఇస్రో ఘనత
ఇస్రోకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్ తో పాటుగా పలు ఖనిజ రాశులు నిక్షిప్తమై ఉన్నట్టు తెలుస్తున్నది. చంద్రయాన్-3 విజయాన్ని అస్వాదిస్తున్న భారతీయులకు ఆదిత్య ఎల్- 1 ప్రయోగం మరో అద్భుతమైన అనుభూతిని కలిగించింది. కేవలం కొన్ని దేశాలకే పరిమితమైన అంతరిక్ష పరిశోధనలను నేడు భారత్ అవలీలగా చేపట్టడం, అంతరిక్ష లక్ష్యాలకు చేరువ కావడం విశేషం. ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం ఒక ఎత్తయితే, సూర్యుడిపై ప్రయోగాలు చేయడం సౌర వ్యవస్థ లో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి ఉపక్రమించడం మరొక ఎత్తు. భగ భగ మండే అగ్ని గోళమైన సూర్యుడి చెంతకు చేరి, సూర్యుని నిరంతర తీక్షణ కాంతి ప్రవాహం గురించి, ఫోటో స్ఫియర్, క్రోమో స్ఫియర్, కరోనా వంటి వివిధ అంశాలపై అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్-1ఉపగ్రహ ప్రయోగం వీలు కల్పిస్తున్నది. ఫోటోస్ఫియర్ నుంచి సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది.
సూర్యుడిపై ప్రయోగాలు
భూభ్రమణం వల్ల మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ఖగోళ ప్రక్రియలు సంభవిస్తున్నాయి. హైడ్రోజన్, హీలియంలతో కూడిన ఒక కాంతివంతమైన నక్షత్రం సూర్యుడు. మనం నివసించే భూగ్రహం సజీవంగా మిగలడానికి, సకల జీవరాశుల ఉనికికి సూర్యుడే ఆధారం. సూర్యకాంతి లేకపోతే భూమిపై జరిగే అనేక ప్రక్రియలు నిలిచి పోయి, జీవరాశుల మనుగడ ప్రమాదంలో పడుతుంది.
భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి రమారమి 365 రోజుల సమయం పడుతుంది. భూమికి సూర్యుడికి మధ్య గల దూరం150 మిలియన్ కిలోమీటర్లు. ఇంత దూరంలో గల సూర్యుడి నుంచి భూమికి చేరడానికి కాంతి ప్రయాణానికి పట్టే దూరం కేవలం కొద్ది నిమిషాలే కావడం విశేషం. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఇతర ఖగోళ ప్రక్రియల గురించి మనకు తెలిసిందే. ఆదిత్యుడికి సంబంధించిన పూర్తి అంశాలపై పరిశోధనలు చేయడం ఆదిత్య ఎల్-1 ప్రయోగం ముఖ్యోద్దేశం. ఏది ఏమైనప్పటికీ సూర్యుడిపై భారత దేశం ప్రయోగాలు చేయడం ముదావహం. ఈ ప్రయోగ లక్ష్యం ఫలప్రదం కావాలని, భారత జాతి పతాకం విజయగర్వంతో విశ్వ వినువీధుల్లో రెపరెపలాడాలని ఆశిద్దాం.
సుంకవల్లి సత్తిరాజు, సోషల్ ఎనలిస్ట్