
ప్రతి పండుగకు ఏదో ఆచారం ఉంటుంది. పూర్వకాలంలో హోలీ పండుగను ఆదివాసీలు ఎంతో ఘనంగా జరుపుకునేవారు. అయితే రంగులు జల్లు కోవడం.. ఊరంతా కలిసి సంబరాలు జరుపుకోవడం..గ్రామ పెద్దకు కుడుక ఇవ్వడం.. ఇలా ఒకటేమిటి.. ఆదివాసీలు సంప్రదాయాలకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మరి హోలీ పండుగ సందర్భంగా ఆదివాసీ గ్రామాల్లోనెలకొన్న సంప్రదాయాలపై ప్రత్యేక కథనం. . .
ఆదివాసీలు హోలీ పండుగను కుడుకుల పండుగ అని కూడా అంటారు. కుడుక అంటే కొబ్బరి అనిఅర్దం. ఇక హోలీ పండుగకు ఎక్కడ ఉన్నా.. ఆదివాసీలు మాత్రం వారి స్వగ్రామానికి చేరుకోవాల్సిందే.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. ఊళ్లో ఉండాలంటే.. గ్రామ పెద్దలకు హోలీ పండుగకు ముందు రోజు యకుడుక ఇవ్వాల్సిందే. కొబ్బరి ముక్కకు ఊళ్లో ఉండడానికి సంబంధం ఏంటి అంటారా?
ఆదివాసీలకు సంబంధించిన ఊళ్లల్లో హోలీ పండుగకు ముందు రోజు ప్రతి ఇంటి నుంచి.. గ్రామ పెద్దకు ఒక కుడుక ఇవ్వాలి. లేదంటే వాళ్లను ఆ ఊరు వెలివేస్తుంది. ఊరి కట్టుబాట్లను లెక్క చేయకున్నా.. ఆ కుటుంబం ఇచ్చే కుడుక తీసుకోరు. అలాంటి వాళ్లు కూడా ఏడాదంతా ఏకాకిలా బతకాల్సిందే.
ఆదీవాసీలు సంప్రదాయాలకు .. ఆచారాలకు పెద్దపీట వేస్తారు. హోలీ పండుగకు ముందు రోజు గ్రామ పెద్దలకు కుడుక ఇవ్వాలి. అలా ఇస్తేనే కుటుంబం గ్రామ జాబితాలో ఉంటుంది. లేదంటే వాళ్లకు ఊళ్లో వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊళ్లో వాళు వెళ్లరు. అందుకే బతుకుదెరువు కోసం ఊరొదిలి వెళ్లిన వాళ్లు ఉద్యోగాలు చేస్తూ వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా హోలీకి తప్పకుండా ఇంటికి వచ్చి కుడుక ఇస్తారు.
దురాడీకొబ్రె
ఈ కుడకను ఆదివాసుల భాషలో దురాడీ కొబ్రె (హోలీ కుడుక) అని పిలుస్తారు. అదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో ఈ పండుగ చేసుకుంటారు. హోలీ రోజు గ్రామానికి కొత్త కుటుంబాలు ఎన్ని చేరాయి. ఎన్ని కుటుంబాలు ఊరొదిలి వెళ్లాయి. బహిష్కరించిన కుటుంబాలు ఎన్నీ... అని లెక్కలు చూస్తారు. కొత్త కాపురాలు పెట్టిన కుటుంబాలు కూడా హోలీ రోజే జాబితాలో చేరాలి. ఈ ఆచారం చాలా సంవత్సరాల నుంచి వస్తోంది
వెలివేస్తే ఒంటరి జీవితమే
ఆదివాసులు కట్టుబాట్లకు... ఆచారాలకు ప్రాణమిస్తారు. కట్టుబాట్లు పాటించకపోతే గ్రామపెద్దలు వెలి తీర్మానం చేస్తారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా కులాంతర వివాహాలు చేసుకున్నా గ్రామ సామూహిక కార్యక్రమాలకు ఐదుకంటే ఎక్కువసార్లు రాకపోయిన .. వాళ్ల కట్టుబాట్లకు విరుద్ధం. అలా చేస్తే ఊరి నుంచి వెలివేస్తారు. క్షమాభిక్ష ఇచ్చేదాకా ఒంటరి జీవితం గడపాల్సిందే. ఆ సమయంలో కుటుంబంలో ఎవరైనా చనిపోయినా పట్టించుకోరు.
ALSO READ | Holi 2025 : రంగ్ బర్సే జర జాగ్రత్తగా.. అన్ని మరకలు మంచిది కాదు..
ఓదార్పు మాట అటుంచితే ... కనీసం ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడరు. వాళ్ల ఇళ్లలో పెళ్లిళ్లకు వెళ్లిన ఊరివాళ్లు కూడా కట్టుబాట్లను ఉల్లంఘించినట్టే. అయితే.. గ్రామ బహిష్కరణకు క్షమాభిక్ష కూడా ఉంటుంది. కానీ దాన్ని గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. ఇక కుడుక ఇచ్చిన కుటుంబాలకు ఊరంతా అండగా ఉంటుంది. వాళ్లింట్లో ఎంత పెద్ద కార్యం జరిగినా అంతా దగ్గరుండి పూర్తి చేస్తారు. పెద్దోడు... పేదోడు అనే తేడా ఉండదు.
కుడుకలకు డిమాండ్
హోలీ దగ్గర పడుతుండడంతో ఏజెన్సీలో కుడుకలకు డిమాండ్ పెరిగింది. ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగకు సుమారు 500 క్వింటాళ్ల కుడుకలు అమ్ముడుపోతున్నాయి. కిలో కుడుకలు 200 నుంచి 300 రూపాయల వరకు అమ్ముతున్నారు. హోలీ పండుగకు వారం రోజుల ముందు నుంచే కుడుకలు చక్కెర పేర్లు కొంటుంటారు.
కుడకలతో కామ దహనం
ఆదివాసులు చేసే కామ దహనానికి ఒక ప్రత్యేకత ఉంది. కుటుంబాల వారీగా సేకరించిన కుడుకలను బొంగు కర్రలపై పేర్చి.... ఊరి బయట వరకు ఉరేగిస్తారు. రాళ్లతో రాపిడి చేసి పుట్టించిన అగ్గితో వాటిని దహనం చేస్తారు. అగ్గిపెట్టె వాడితే అపరాధంగా భావిస్తారు. దహనం తర్వాత చిన్నారులకు చక్కెర పేర్ల (పంచదార చిలుకలు)ను పంచి వేడుకలు చేస్తారు. కొంతమంది రాత్రిపూట జాజీరి ఆడుతూ... ప్రతి ఇంటికి తిరుగుతారు వాళ్లకు అందరూ ధాన్యం, డబ్బు ఇస్తారు. ఆ ధాన్యాన్ని ఉగాది రోజు వండి పశువులకు పెట్టి వాళ్లు తింటారు.
కామ దహనం చేసిన చోట రాత్రంతా జాగారం ఉంటారు. ఆ తర్వాత దొంగిలించి తెచ్చిన కోళ్లు. మేక పోతులను బలిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మరుసటిరోజు రంగులు చల్లుకుని హోలీ ఆడతారు. హోలీ పండుగ రోజు బావ... బామ్మర్థులు ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు. మోదుగ పూలతో చేసిన రంగులు చల్లుకుంటు డాన్స్ చేస్తారు.
–వెలుగు,లైఫ్–