
- పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
బెల్లంపల్లి, వెలుగు: ఆదివాసీల భూమి కబ్జా చేసి వారిపై దాడులకు పాల్పడుతున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ కొలవార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెన్నెల మండలంలోని నందులపల్లికి చెందిన పీటీజీ గిరిజనులు జంబి పోచయ్య, జంబి లచ్చయ్య, జంబి నగేశ్ తమ తాతల కాలం నుంచి సర్వే నెంబర్ 179/1లో 5.08 ఎకరాలు,179/2 లో 1.23 ఎకరాల భూమిని తమ తాతల కాలం నుంచి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఇదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు గంట లక్ష్మి, గంట అనిల్, అలంపెల్లి సంజీవ్, ఠాకూర్ గజేందర్ సింగ్ ఆ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఆక్రమణలపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని, పలు మార్లు దాడులు చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై నెన్నెల ఎస్ఐ, బెల్లంపల్లి రూరల్ సీఐకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గిరిజనుల భూములు ఆక్రమించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి తిరిగి భూములు ఇప్పించాలని కోరారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కమ్మరి భీమయ్య, ప్రధాన కార్యదర్శి చింతపురి రఘు తదితరులు పాల్గొన్నారు.