- నాయకపోడ్ పూజారులు వర్సెస్ జాకారం పంచాయతీ
- ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నారన్న పూజారులు
- ములుగు తాహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన
- ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలని ఆర్డీవో లెటర్
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంపై ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. మేడారం వెళ్లే భక్తులకు మొదటి మొక్కుల తల్లిగా పేరుగాంచిన గట్టమ్మ తమ ఆరాధ్య దైవమని, తమ హక్కులను కాలరాసేలా జాకారం పాలకవర్గం, గ్రామస్తులు వ్యవహరిస్తున్నారని ఆదివాసీ నాయకపోడ్ పూజారులు, సంఘం నాయకులు గురువారం ములుగు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే టైంలో టెండర్లను ఎందుకు నిలిపివేశారంటూ జాకారం గ్రామస్తులు సైతం ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర సందర్భంగా వారం రోజుల ముందు నాయకపోడ్ పూజారులు ఎదురుపిల్ల పండుగ నిర్వహిస్తారు.
అప్పటి నుంచే షాపులను నిర్వహించాలని వారు వాదిస్తున్నారు. అయితే ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ మాత్రం నెలరోజుల ముందు నుంచే షాపులు నిర్వహించేలా కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడంతో వివాదం మొదలైంది. దీంతో ములుగు తహసీల్దార్ విజయ్‌భాస్కర్ గురువారం ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. వచ్చే జాతర వరకు ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొస్తామని, ఈ సారి ఆలయ నిర్వహణ నాయకపోడ్‌లకు అప్పగించి, షాపుల టెండర్లు మాత్రం జాకారం పంచాయతీ నిర్వహించాలని సూచించారు.
దీంతో ఆగ్రహానికి గురైన నాయకపోడ్ పూజారులు దీనికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గట్టమ్మ తల్లిని తమ తాత, ముత్తాతల నుంచి కొలుస్తున్నామని, ఆలయ నిర్వహణ గతంలో ములుగు పరిధిలోనే ఉండగా, రాజకీయ స్వార్థంతోనే జాకారం గ్రామానికి మార్చారని ఆదివాసీ నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జాకారం జీపీ పరిధిలో ఉన్న గట్టమ్మ వద్ద టెండర్లు నిర్వహించి, శానిటేషన్ పనులు చేపట్టే అర్హత తమకు ఉందని పంచాయతీ ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై అప్పని వెంకటేశ్వర్ అక్కడికి వచ్చి నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అనంతరం తహసీల్దార్విజయ్ భాస్కర్ ఈ విషయాన్ని ఆర్డీవో సత్యపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గట్టమ్మ ఆలయంపై పూర్తి అధికారాలను ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో ఎండోమెంట్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు.
ఆయన శుక్రవారం గట్టమ్మ ఆలయాన్ని సందర్శించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆలయ నిర్వహణను దేవాదాయ శాఖ మాత్రమే చూసుకోవాలని, జాకారం పంచాయతీ ఆఫీసర్లు కలుగజేసుకోవద్దని పూజారులు, ఆదివాసీ నాయకపోడ్‌లు డిమాండ్ చేస్తున్నారు.