వెంకటాపురం, వెలుగు: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీల అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఆదివాసీ నవనిర్మాణ సేన నాయకులు అన్నారు. సోమవారం ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ అస్తిత్వ పోరాట చైతన్య యాత్ర, బహిరంగ సభను ములుగు జిల్లా వెంకటాపురంలో నిర్వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారని అన్నారు.
ఏజెన్సీకి వచ్చిన వలసవాదులను తరిమికొట్టేవరకు సంఘటితంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన చట్టాలను అపహాస్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలకు వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. జీవో నంబర్ 3 తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలే కారణమని, ఆదివాసీల పక్షాన కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాటం చేయలేదని విమర్శించారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామంటూ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు బూటకమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోడు భూముల హక్కు పత్రాల పంపిణీపై పెసా గ్రామసభలు నిర్వహించాలన్నారు. వందల సంవత్సరాల క్రితం గిరిజనులు సాగు చేసిన సారవంతమైన భూములు వలస గిరిజనేతరుల దగ్గర ఉన్నాయని గతంలోనే కోనేరు రంగారావు కమిటీ తేటతెల్లం చేసిందన్నారు.
ఏజెన్సీలో వలస గిరిజనేతరులు బిజినెస్ చేస్తూ రాజకీయాలను శాసిస్తున్నారని అన్నారు. స్వయం పాలన రావాలంటే తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. వలస గిరిజనేతరులపై ఆదివాసీలు చేస్తున్న పోరులో స్థానిక గిరిజనేతరుల సహకారం కావాలని నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్శ నరసింహమూర్తి కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, నాయకులు మోర్రం వీరభద్రం, ముద్దిరాజు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ వీరమల్లు, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీకాంత్ స్మిత్, పలువురు నాయకులు
పాల్గొన్నారు.