
- మామిడిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన
- సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ సంఘాల ఆందోళన
- రిమ్స్ ముందు జాతీయ రహదారిపై మూడు గంటల పాటు రాస్తారోకో
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ఆదిలాబాద్జిల్లా జైనథ్మండలంలోని మాంగుర్ల గ్రామానికి చెందిన తొడసం మహేశ్వరి(12) అనే ఆదివాసీ స్టూడెంట్జ్వరంతో చనిపోయింది. దీనికి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రాస్తారోకో చేశారు. తొడసం నాగోరావ్, లక్ష్మీబాయి దంపతుల పెద్ద బిడ్డ మహేశ్వరి..మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదివేది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో తండ్రి నాగోరావ్ వచ్చి మంగళవారం ఇంటికి తీసుకెళ్లాడు. ఆరోగ్యం విషమించడంతో అదే రోజు రాత్రి రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయింది.
దీంతో మృతికి ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాలిక తల్లిదండ్రులు, బంధువులు, ఆదివాసీ సంఘాల లీడర్లు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రిమ్స్ముందు జాతీయ రహదారిపై మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. తమ కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తీసుకెళ్తామని సోమవారం పాఠశాలకు వెళ్లి అడిగితే పంపించలేదని, తామే ట్రీట్మెంట్ చేయిస్తామని తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో చికిత్స అంది ఉంటే తమ కూతురు బతికుండేదని బోరుమన్నారు. హెచ్ఎం అశోక్, ఏటీడీఓ నిహారిక పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బాధ్యులను సస్పెండ్‌చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆందోళన ఉధృతమవడంతో ఐటీడీఏ డీడీ దిలీప్కుమార్అక్కడకు వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ధర్నాలో ఆదివాసీ సంఘాల నాయకులు ఉయిక ఇందిర, ఉయిక సంజీవ్, వెట్టి మనోజ్, సిడం సాయికుమార్, భాస్కర్, సచిన్, గణేశ్, వరున్, సలాం పాల్గొన్నారు.