ఎలక్షన్ల కోసం ఏకతాటిపైకి ఆదివాసులు

  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఆదివాసీ నేతలనే గెలిపించుకోవాలని నిర్ణయం
  • మూడు ఎస్టీ నియోజకవర్గాలపై స్పెషల్​ ఫోకస్​
  • రాయిసెంటర్లలో చర్చలు.. గూడేల్లో తీర్మానాలు
  • సెప్టెంబర్ 3న ఇంద్రవెల్లిలో ఆదివాసీల డిక్లరేషన్ సభకు ఏర్పాట్లు

ఆదిలాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈసారి లంబాడా వర్గం నేతలను కాకుండా తమ ఆదివాసీ తెగలకు చెందిన లీడర్లనే గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ సెగ్మెంట్లు అయిన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాయి సెంటర్లలో ఆదివాసీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతివ్వాలని మాట్లాడుకుంటున్న  పెద్దలు,  గూడాల్లో తీర్మానాలు కూడా చేయిస్తున్నారు. 

గత ఆదివారం ఆదిలాబాద్ లోని ఆదివాసీభవన్ లో తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ పెద్దలు సమావేశమై, తీర్మానం చేశారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థులకే మద్దతివ్వాలని తమ వర్గీయులకు పిలుపునిచ్చారు. కాగా, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొన్నాళ్లుగా ఆదివాసీ గిరిజనులు డిమాండ్​ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో కొందరు నేతలు మాత్రం రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు విడుదల చేసే మేనిఫెస్టోలు చూశాక, అందులో తమ డిమాండ్​ను చేర్చినట్లు తేలితే అప్పుడు ఆయా పార్టీలకు మద్దతిచ్చే అంశాన్ని ఆలోచిస్తామని చెప్తున్నారు.  మరోవైపు సెప్టెంబర్ 3న ఇంద్రవెల్లిలో పార్టీలకు అతీతంగా ఆదివాసీల డిక్లరేషన్ సభ నిర్వహించేందుకు ఆదివాసీ పెద్దలు రెడీ అవుతున్నారు.

మూడు నియోజకవర్గాలపై ఫోకస్​

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఆదివాసులు గెలుపోట ములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2.06 లక్షల ఓటర్లు ఉండగా, 40 వేల ఓట్లు,  ఖానాపూర్ నియోజకవర్గంలో  2.10 లక్షల ఓట్లకు 45 వేల ఓట్లు, బోథ్ నియోజకవర్గం లో 2.04 లక్షల ఓట్లకు 48 వేల ఓట్లు ఆదివాసీలవే. కానీ, ఎలక్షన్లలో ఆదివాసీలకు ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా ఆదివాసీల్లో ఐక్యత లేక లంబాడా నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని, వాళ్లు తమ సమస్యలను పట్టించుకోవడం లేదనే భావన ఆదివాసీ గిరిజనుల్లో ఉంది. 

నిజానికి ఆదివాసీలు కొన్నాళ్లుగా ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో కొత్తగా 11 కులాలను చేర్చేందుకు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని, ఆదివాసీ గ్రామాల్లో తాగు నీరు, రోడ్లు, వైద్యసదుపాయాలు కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఆదివాసీ యేతర ఎమ్మెల్యేలు ఉంటే తమ సమస్యలు పరిష్కారం కావడం లేదనే అభిప్రాయంతోనే.. ఈ సారి తమ వర్గానికి చెందిన నేతలను ఎమ్మెల్యేలుగా పంపాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ ప్రధాన పార్టీలేవీ తమ వర్గపు నేతలకు టికెట్లు ఇవ్వకుంటే ఇండిపెండెంట్లుగా బరిలో దింపేందుకు రెడీ అవుతున్నారు. 

కాంగ్రెస్​, బీజేపీపైనే ఆశలు.. 

బోథ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును, ఖానాపూర్​లో రేఖాశ్యాంనాయక్​ను  పక్కనపెట్టిన హైకమాండ్​ ఆ స్థానాల్లో అదే లంబాడా సామాజికవర్గానికి చెందిన అనిల్ జాదవ్,  జాన్సాన్ నాయక్​లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఈ రెండు చోట్ల  కాంగ్రెస్, బీజేపీపైనే ఆదివాసీనేతలు ఆశలుపెట్టుకున్నారు. బోథ్​లో బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావుతో పాటు రిటైర్డ్​ అడిషనల్ ఎస్పీ సెడ్మకి గోద్రు, సాకటి దశరథ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్​ కోసం ఆదివాసీ తెగకు చెందిన గొడాం గణేశ్​, వన్నెల అశోక్, కుమ్ర కోటేశ్, కొడప నగేశ్, తొడసం దౌలత్ రావు, జల్కె పాండు రంగ్ దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ గొడాం నగేశ్ ​బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా ఆదివాసీ నేతల సమావేశాల్లో చర్చకు వస్తోంది.

 ఖానాపూర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ నుంచి ఆదివాసీ నేతలు వెడ్మ బొజ్జు, పెందూర్ ప్రభాకర్, బీజేపీ నుంచి లంబాడా సామాజికవర్గానికి చెందిన రాథోడ్​ రమేశ్​, ఆదివాసీ నేత భీంరావు టికెట్ ఆశిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో ఎవరు తమ తెగ నేతలకు టికెట్​ ఇస్తే ఆ అభ్యర్థులకే మద్దతివ్వాలని ఆదివాసీలు భావిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఆదివాసీ నేత  కోవ లక్ష్మికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా, బీజేపీ నుంచి కూడా అదే తెగకు చెందిన కోట్నక్ విజయ్, 

కాంగ్రెస్ నుంచి మర్సకోల సరస్వతి, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, కొత్తగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన అజ్మీరా శ్యాంనాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్​ టికెట్​ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  ఇక్కడ కాంగ్రెస్​ఆదివాసీయేతరులకు టికెట్​ కేటాయిస్తే ఆదివాసీల ఓట్లు బీఆర్ఎస్​, బీజేపీకి పడే చాన్స్​ ఉందని భావిస్తున్నారు.