దోపిడీకి గురవుతోన్న ఆదివాసీలు.. తుడుం దెబ్బ రాష్ట్ర మహా సభలో హెచ్సీయూ ప్రొఫెసర్ శ్రీనివాస రావు

దోపిడీకి గురవుతోన్న ఆదివాసీలు.. తుడుం దెబ్బ రాష్ట్ర మహా సభలో హెచ్సీయూ ప్రొఫెసర్ శ్రీనివాస రావు

ఆసిఫాబాద్, వెలుగు: రాజ్యాంగ హక్కులతో పాటు రిజర్వేషన్లలో ఆదివాసీలు దోపిడీకి గురవుతున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీఎస్ డబ్ల్యూ శ్రీనివాసరావు పేర్కొన్నారు.  ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో జరుగుతున్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి,(తుడుం దెబ్బ) రాష్ట్ర మహాసభ రెండో రోజు ఆదివారం ఆయన చీఫ్​గెస్ట్ గా పాల్గొన్నారు. 

ముందుగా కుమ్రంభీం విగ్రహం, సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లంబాడీలు కేవలం విద్యా అభివృద్ధికి మాత్రమే ఎస్టీలుగా పరిగణించబడ్డారని, దీన్ని సాకుగా తీసుకుని జీవో కాల పరిమితి ముగిసినా..  విద్య , ఉపాధి,రాజకీయ, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను అక్రమంగా అనుభవిస్తూ ఆదివాసీలను దోచుకుంటున్న తీరుపై తాను రీసెర్చ్ చేశానని పేర్కొన్నారు.  తెలంగాణలో ఆదివాసీలు డిమాండ్ చేస్తున్న ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు న్యాయమైనదే అన్నారు.  ఆదివాసీల పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 

ఆదివాసీ నేతలు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా నిరంతరం పోరాటాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలు చేశారు. ఈ సభలో రాష్ట్ర కన్వీనర్ బూర్స పోచయ్య, కో  కన్వీనర్ లు  సిద్ధిబోయిన లక్ష్మీనారాయణ, కోట్నక విజయ్ కుమార్,  గణేశ్, పోడం బాపు తదితరులు పాల్గొన్నారు.