- ఇద్దరిని హత్యచేసిన మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీల ర్యాలీ
ఏటూరునాగారం, వెలుగు : అమాయక ఆదివాసీలను చంపడమే మావోయిస్ట్ పోరాట సిద్ధాంతమా ? అని పలువురు ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో ములుగు జిల్లా వాజేడుకు చెందిన పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్ (35), ఉయిక అర్జున్ (40)ను గురువారం రాత్రి మావోయిస్ట్‌లు హత్య చేశారు. దీంతో మావోయిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా ఆదివాసీ గూడేల ప్రజలు శనివారం నిరసన తెలిపారు. ఇందులో భాగంగా సుమారు వెయ్యి మంది ఆదివాసీ యువతీయువకులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వై జంక్షన్ వద్ద 163 హైవేపై బైఠాయించారు. మావోయిస్ట్‌లు తమ ఉనికిని చాటుకోవడానికి ఆమాయక ఆదివాసీలను చంపడం సరికాదన్నారు. ఇదేనా వారి పోరాట సిద్ధాంతం అని ప్రశ్నించారు. రమేశ్, అర్జున్‌ను హత్య చేయడం అమానుషమని, వీరి హత్యలపై ప్రజాసంఘాలు స్పందించాలని కోరారు.