- చింతల మానేపల్లిలో ఆదివాసీల నిరసన
కాగజ్ నగర్, వెలుగు : డబ్బా సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై వారం గడుస్తున్నా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణమేంటో చెప్పాలని ఆదివాసీ తుడుందెబ్బ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆదివాసీలను కులం పేరుతో దూషించాడని దీనిపై చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినా ఇప్పటికీ అరెస్ట్ చేయలేదన్నారు.
రషీద్ ను 24 గంటల్లో అరెస్టు చేయాలని లేకుంటే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఘటనపై ఈ నెల19న జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు శ్యామ్ రావు, మనోజ్, నారాయణ, మహిళా నాయకురాళ్లు లక్ష్మి, పద్మ, పోశక్క, కమల తదితరులు పాల్గొన్నారు.