వర్షంలోనూ పోడు పోరు కొనసాగిస్తున్న గిరిజనులు

  • కోయపోషగూడంలో హైటెన్షన్ కంటిన్యూ
  • భూముల్లో మళ్లీ గుడిసెలు వేసి గిరిజనుల నిరసన
  • వర్షాన్ని లెక్కచేయకుండా గుడిశెలు వేసుకున్న గిరిజనులు

మంచిర్యాల జిల్లా: పోడు రైతుల గోస కొనసాగుతోంది. తమ భూములను వదులుకునే విషయంలో ఆదివాసీలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జోరు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తమ స్థలాల్లో గుడిశెలు వేసుకున్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఊసే గుర్తు లేనట్లు పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఏకంగా 12మంది మహిళలను గత నెలలో జైలుకు పంపిన ఫారెస్ట్ అధికారులు నిన్న మరోసారి కోయపోషగూడెంపై దండెత్తారు. భారీ సంఖ్యలో తరలివచ్చి పోడుభూముల్లో ఆదివాసీసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. 
గిరిజనులు అధిరానేల కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకుండా గుడిసెలను బలవంతంగా పీకేశారు.

వర్షం మొదలవడంతో అటవీ అధికారులు వెనుదిరిగి వెళ్లినా.. గిరిజనులు మాత్రం అక్కడే ఉండిపోయారు. జోరు వాన సైతం లెక్కచేయకుండా పోడు పోరును కొనసాగిస్తున్నారు. అంతేకాదు అదే చోట మళ్లీ గుడిసెలను వేసుకున్నారు. ఈ మట్టిని నమ్ముకుని బతుకుతున్న తాము వేరే ఎక్కడికో ఎలా వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఎన్నిసార్లు తొలగించినా మళ్లీ మళ్లీ వేసుకుంటూనే ఉంటం.. మా భూమి వదిలి వెళ్లేదే లేదు

నిన్న అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా గుడిశెలు తొలగించడంపై ఆదివాసీ మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చుకలాంటి తమపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని వాపోయారు. బలవంతంగా గుడిశెలు తొలగించినా.. మళ్లీ మళ్లీ వేసుకుంటూనే ఉంటామని.. ఈ భూమిని వదిలి వేరే ఎక్కడికో వెళ్లేదేలేదని స్పష్టం చేశారు. ఇంటికో గుడిశె చొప్పున వేసుకుంటూనే ఉంటామని.. పట్టాలిచ్చే వరకు వెళ్లేదిలేదని తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు తొలగిస్తారో మేమూ చూస్తామని అంటున్నారు.