నాగర్‌కర్నూల్, వెలుగు : తమకు కనీస వసతులు కల్పించాలన్న డిమాండ్‌తో నల్లమలలోని చెంచుపెంటలు ఏకమవుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి చెంచు పెంటలను ఖాళీ చేయించి చెంచులను తరలించే స్కీమ్ మొదలుకుని విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం అడవిబిడ్డలు గొంతెతుత్తున్నారు.
ఉపాధి కరువు..
చెంచులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాల్సి ఉండగా.. మారిన నిబంధనలతో ఉపాధి హామీ ఆఫీస్‌కు శాశ్వతంగా తాళం పడింది. కేవలం చెంచుల అభివృద్ది కోసం మన్ననూర్‌లో ఏర్పాటు చేసిన ఐటీడీఏ అసలు ఉందా? లేదా? అన్న విధంగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన్ననూర్ ఐటీడీఏ ఆఫీస్ వన్ మ్యాన్ ఆర్మీగా మారిపోయింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నారు. చెంచులకు వైద్యం అందించడం కోసం ఏర్పాటైన మొబైల్ యూనిట్ మూతపడింది. దాతలు ఇచ్చిన అంబులెన్స్ ఆఫీస్ చెట్ల కింద పెట్టేశారు.
చెంచుల అభివృద్ది కోసం కేటాయించే నిధులను ఖర్చు చేసేందుకు అన్ని కీలక శాఖల నుంచి సిబ్బందిని డిప్యూట్ చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఉపాధి, ఇతర ప్రధానమైన శాఖలకు సిబ్బంది లేరు. ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తుండగా ఈ మధ్య ఏపీవోను బదిలీపై పంపించారు. ఆమె ఐటీడీఏ, డీటీడబ్ల్యూవోగా పని చేయాలన్న ఆదేశాలు గందరగోళంగా మారాయి. ఇక కలెక్టర్లు మారిన ప్రతిసారీ ఐటీడీఏ ఇన్చార్జి పీవోలను మారుస్తున్నారు.
పదేండ్లుగా పట్టించుకోలే..
నల్లమలలో పీసా,1/70 చట్టాలు అమలు చేయాలని చెంచులు గట్టిగా పట్టుబడుతున్నారు. అడవిలో ఉన్న చెంచులను నాగరిక ప్రపంచంలోకి తరలించాలనే ప్రయత్నాలు బాగానే ఉన్నా.. అడవిలో ఉన్నంత వరకైనా తమకు దక్కాల్సిన పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. పూర్తి స్థాయిలో ఐటీడీఏ ఆఫీస్‌ను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో పదేండ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తమకు కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ఉందని చెబుతున్న చెంచులు, తమ బాధలను చెప్పుకోవడానికి ఇటీవల మన్ననూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు చలో అసెంబ్లీని అడ్డుకున్నారు.
డిమాండ్లివే..
చెంచు యువతకు చిన్నచిన్న ఉద్యోగాలు ఇవ్వకుండా.. జనరల్ కోటాలో పోటీపడి సాధించుకోవాలని చెప్పడంతో అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతో ఎలాంటి ఉపయోగం లేదని, బ్యాంకు రుణాలు, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా వర్తించడం లేదని వాపోతున్నారు.
కొల్లాపూర్ మండలంలోని చెంచుల భూములు పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైతే పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. గైరాన్ పట్టాలకు సైతం పరిహారం చెల్లించిన గత ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని వాపోతున్నారు.
ఏజెన్సీ ఏరియాలోని ఆశ్రమ, గిరిజన పాఠశాలలను ఐటీడీఏ పరిధిలో చేర్చి సీఆర్టీ, నాల్గో తరగతి ఉద్యోగాలు స్థానిక చెంచులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటీఆర్, నల్లమలలో టైగర్ ట్రాకర్స్, వాచర్స్గా పని చేస్తున్న చెంచులను రెగ్యులరైజ్ చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
అటవీ ఉత్పత్తుల సేకరణపై చెంచులకు హక్కు కల్పిస్తూ గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌలతులు కల్పించాలని, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని కోరుతున్నారు.
లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని చెంచు పెంటల నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు 100 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని, తమను అమ్రాబాద్ మండలంలో కలపాలని కోరుతున్నారు.
ఫండ్స్ రావడం లేదు..
చెంచుల స్కీములు, నిధుల గురించి ఎలాంటి సమాచారం లేదు. చెంచుల అభివృద్ధి, సంక్షేమానికి పదేండ్ల నుంచి ఎలాంటి ఫండ్స్ రాలేదు. పూర్తి స్థాయి అధికారులు, సిబ్బంది లేక ఔట్ సోర్సింగ్ సిబ్బందితో ఆఫీస్ నడిపిస్తున్నాం.
– జాఫర్, సీనియర్ అసిస్టెంట్, ఐటీడీఏ