చిరుధాన్యాలే .. ఆదివాసీల హెల్త్​ సీక్రెట్

చిరుధాన్యాలే .. ఆదివాసీల హెల్త్​ సీక్రెట్
  • చిరుధాన్యాలను పండిస్తూ వాటినే ఆహారంగా తీసుకుంటున్న ఆదివాసీలు
  • జొన్నలు, సజ్జలు, రాగులతోపాటు నువ్వులు, శనగల సాగు
  • సేంద్రియ ఎరువుల వాడకం​

ఆసిఫాబాద్ / జైనూర్, వెలుగు: ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పు రాకుండా అనాదిగా వస్తున్న విధానాలు ఆచరిస్తూ, చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. పురాతన కాలం నుంచి మిల్లెట్ సాగు చేస్తూ వాటినే ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

ఇప్పటికీ అనాది మిల్లెట్ పంటలే..

వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయి. దిగుబడి కోసం రైతులు చేనుల్లో విచ్చలవిడిగా మందులు పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా వరి పండిస్తూ వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. కానీ ఆసిఫాబాద్​జిల్లాలోని ఆదివాసీలు మాత్రం వ్యవసాయంలో నాటి కాలం పద్ధతులనే పాటిస్తూ చిరుధాన్యాలను పండిస్తున్నారు. వాటినే ఆహారంగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్​లో మక్కలు, జొన్న, గోధుమలు, నువ్వులు, శెనగల సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా సజ్జలు, రాగులు, మినుములు పండిస్తున్నారు. ఎక్కువగా మిలెట్స్ సాగు చేయడం వల్ల బయటి ఆహార పదార్థాలు వాడడం లేదు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న జొన్నలు, రాగులు, సజ్జలు, శెనగలను నిత్యం ఆహారంగా తీసుకుంటున్నారు. మక్కలు, జొన్నలు, గోధుమలను కేవలం ఇంట్లో వాడుకునేందుకు పండిస్తున్నారు. పండించిన ధాన్యంతో ఉదయం అంబలి, జొన్న గటక, మధ్యాహ్నం అన్నంతో పప్పు, కాయగూరలు తింటున్నారు. కూరలకు ఏజెన్సీతో పాటు సమీప  ప్రాంతాల్లో పండిస్తున్న టమాటా, వంకాయ, మిర్చీ, సొరకాయ, బీరకాయలను వాడుతుంటారు.

నాన్ వెజ్ కూడా నాటుకే ప్రయారిటీ..

ఇప్పుడు బాయిలర్ చికెన్ కాలం నడుస్తోంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో బాయిలర్ చికెన్ వాడకం కన్నా ఇంట్లో పెంచుకునే నాటు కోడికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో నాటు కోళ్లను పెంచుతారు. బంధువులు వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా నాటు కోడినే కోస్తారు. బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్తే కోడిని, లేదా మేకను తీసుకెళ్లి అందిస్తారు. ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యి మీదనే ఆహారం వండడం.. కుండలు, బుగ్గెండి, ఇత్తడి పాత్రల్లో వండుకొని తినడం వారి ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్నాయి.

సాంప్రదాయ పంటలే రైతులకు మేలు చేస్తాయి

నేను ఏటా రెండెకరాల్లో జొన్న పంట సాగు చేస్తున్నా. దిగుబడి ఎక్కువగానే వస్తుంది. మేము పండించిన ధాన్యాలు రుచిగానూ ఉంటాయి.  జొన్న రొట్టె, గట్కా, అంబలి ఆహారంగా తీసుకుంటాం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నామంటే ఆహార అలవాట్లు మార్చుకోకపోవడమే.. 

మడావి వెంకట్ రావు, రైతు, గుడిపేట్, తిర్యాణి 

తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి

నేను గత యాసంగిలో మక్కలు వేశాను. తక్కువ పెట్టుబడితో మంచి దిగ్గుబడి వచ్చింది. ఇంటికి ఏడాదికి కావాల్సిన ధాన్యాన్ని పండించిన. వచ్చే సీజన్​లో విత్తడానికి సీడ్ కూడా పక్కకు ఉంచిన. 

తొడసం సీతారాం, రైతు, మర్లవాయి