కేటీఆర్ పిటిషన్‎పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత

కేటీఆర్ పిటిషన్‎పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‎పై తదుపరి విచారణను నాంపల్లి కోర్టు 2024, అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి సురేఖ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన గౌరవానికి భంగం కలిగించేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరుఫున న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‎లను సాక్షులుగా కేటీఆర్ పిటిషన్‎లో పేర్కొన్నారు.  కేటీఆర్ పిటిషన్‎పై న్యాయస్థానం ఇవాళ (అక్టోబర్ 10) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా..  మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలకు సంబంధించిన క్లిప్‎‎లను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. కొండా సురేఖకు వ్యరేతికంగా మొత్తం 23 రకాల సాక్ష్యాలను కేటీఆర్ లాయర్ కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది.

Also Read:-మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా