అందరూ ఓటేసేలా..పోలింగ్​శాతం పెంపు

  •     పోలింగ్​శాతం పెంపుపై జిల్లా యంత్రాంగం ఫోకస్​
  •     యువత, మహిళల కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు
  •     కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రచారకర్తల నియమాకం

కామారెడ్డి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ శాతం పెంపు దిశగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్లు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా గ్రామాలు, టౌన్​లలో ఓటర్లు చైతన్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పద్దెనిమిదేండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ఓ అధికారిని నియమించడంతో పాటు ఇద్దరు ప్రచారకర్తలను కూడా నియమించారు. 

ALSO READ : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతు కళ్లలో ఆనందం

అవగాహన కలిగేలా..

ప్రతిఒక్కరూ ఓటు వేసేలా స్విప్ ​ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నారు. కాలేజీల్లో, గ్రామాల్లో మహిళా సంఘాలతో మీటింగ్​లు జరుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో మాక్ అసెంబ్లీలు ఏర్పాటు చేస్తూ ఓటుహక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన యువత ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు తమ కుటుంబసభ్యులు కూడా తప్పనిసరిగా​ఓటేసేలా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. యువతలో అవగాహన కోసం జిల్లాలోని డిగ్రీ కాలేజీలు, జూనియర్​ కాలేజీల్లో నాటకాలు ప్రదర్శన, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు.

విజేతలకు బహుమతులు అందిస్తూ ఉత్సాహ పరుస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని డ్వాక్రా సంఘాలతో సమావేశమవుతున్నారు. అందులోని సభ్యులను గ్రూప్​లుగా విభజించి చర్చాగోష్టులు కండక్ట్​ చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. కలెక్టరేట్​తో పాటు, ఆర్డీవో, తహసీల్​ ఆఫీసుల్లో  ఈవీఎం మిషన్ పై అవగాహన కలిగేలా పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఆఫీసులకు వివిధ పనులపై వచ్చే వారికి ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.  స్విప్ ​ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ హాజరై ఓటు విలువ తెలియజేస్తున్నారు. ఓటర్ల నమోదు, ఓటు హక్కు వినియోగం(స్విప్) కోసం మెప్మా పీడీ శ్రీధర్​రెడ్డిని నియమించారు.

ఇద్దరు ప్రచారకర్తల నియమాకం

చిన్న వయసులో ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, ఇటీవల రాష్ట్రస్థాయిలో దాశరథి పురస్కారం అందుకున్న కవి ఆయాచితం నటేశ్వర్​శర్మను  జిల్లా ప్రచారకర్తలుగా నియమించారు. వీరు కాలేజీల్లో ఏర్పాటు చేసే మీటింగు​లకు హాజరై ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు.

2018 ఎన్నికల్లో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో 2,05,686 మంది ఓటర్లకు గాను 1,60,921 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.78.29 శాతం పోలింగ్​నమోదైంది. ఎల్లారెడ్డిలో  1,95,049 మంది ఓటర్లకు గాను 1,67,804 మంది (86.8 శాతం) ఓటేశారు. జుక్కల్​లో 1,77,001 ఓటర్లకు గాను లక్షా 32 వేల మంది(75 శాతం) ఓటేశారు.

ఓటరు నమోదుకు అనుహ్య స్పందన

జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అనుహ్య స్పందన వచ్చింది. 18 ఏండ్లు నిండిన వ్యక్తులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రచారం చేశారు. స్పెషల్​ క్యాంప్​లు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా 22,831 కొత్తగా ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్పులు, చేర్పుల తర్వాత ఈ నెల 4న నియోజకవర్గాల వారిగా ఓటర్ల ఫైనల్​ లిస్ట్​  సైతం రిలీజయింది.