హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగిసింది. ఈ సందర్భంగా సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ఇప్పటివరకు 60,673 మంది పిల్లలను చేర్పించారు. బడులు ప్రారంభమైన రోజే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ షురూ చేశారు. గురువారం నాటికి 18,50,400 మంది విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయగా, 20.98 లక్షల మందికి పాఠ్యపుస్తకాలను అందించామని స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అధికారులు ప్రకటించారు. మరోవైపు 11,65,748 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, 4,31,780 మందికి వర్క్ బుక్స్‌ను పంపిణీ చేశారు.
బడిబాట ముగిసినా ఏ స్కూల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియ ఆపబోమని అధికారులు తెలిపారు. సర్కారు బడుల్లో చేరిన స్టూడెంట్లకు ఉదయం రాగిజావ, మధ్యాహ్నం పౌష్టికాలతో కూడిన మీల్స్ అందిస్తున్నామని వెల్లడించారు. జనరల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా అందిస్తామన్నారు. బడిబాట కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వెంకట్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.