స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ

స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ
  • వచ్చే నెల 4 నుంచి క్లాసులు.. తొలిదశలో 4 కోర్సులు
  • తాత్కాలికంగా న్యాక్, ఈస్కీలో క్యాంపస్​లు
  • వర్సిటీకి బిల్డింగ్ అప్పగించిన అధికారులు.. పరిశీలించిన వీసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 4 నుంచి క్లాసులు నిర్వహించేందుకు వర్సిటీ వీసీ సుబ్బారావు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శాశ్వత భవనాలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​(న్యాక్), గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈస్కీ)లో క్లాసులు నిర్వహించనున్నారు. 

ఈ  రెండు చోట్ల స్కిల్ వర్సిటీకి రెండు బ్లాక్ లను న్యాక్, ఈస్కీ అధికారులు అప్పగించారు.  సుమారు 30వేల ఎస్ ఎఫ్ టీ లో ఉన్న ఈ రెండు బ్లాక్​లను మంగళవారం వీసీ సుబ్బారావు పరిశీలించారు. క్లాసుల నిర్వహణకు కావాల్సిన ఫర్నిచర్​తో పాటు ఇతర అడ్మినిస్ట్రేటివ్​ ఏర్పాట్లు చేస్తున్నారు. 

తొలిదశలో 2 వేల మందికి శిక్షణ

యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో తొలి దశలో 4  కోర్సులకు క్లాస్ లు నిర్వహించనున్నారు.  మొత్తం 17 కోర్సుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. తొలి దశలో 4  కోర్సుల్లో 2 వేల మందికి ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి  100 శాతం జాబ్ ప్లేస్ మెంట్ లభించనున్నది. 

ఇందులో ఫార్మాసూటికల్​ లైఫ్ సైన్సెస్, ఈ కామర్స్ లాజిస్టిక్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్, స్కూల్ ఆఫ్ కన్​స్ట్రక్షన్స్​ ఇంటీరియర్స్, రిటైల్ ఆపరేషన్స్ మేనేజ్ మెంట్,  యానిమేషన్స్ , గేమింగ్  విజువల్ ఎఫెక్ట్స్ కామిక్స్, తదితర కోర్సులు ఉన్నాయి. 

వచ్చే నెలలో శాశ్వత బిల్డింగ్ పనులు 

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని 57 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత భవనాలను  నిర్మించనున్నారు.  ఇందుకు ఈ ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ ల నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చి రూ. 200 కోట్లు కేటాయించింది. ఇటీవల సీఎం సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. 

 వర్సిటీకి ఇప్పటికే అదానీ గ్రూప్ రూ.100 కోట్లు ప్రకటించగా, పలువురు విరాళాలు ఇస్తున్నారు. దేశంలో పలువురు ప్రముఖులతో ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. 

ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా, శ్రీని రాజు, సతీశ్​ రెడ్డి, సుచిత్ర ఎల్లా, మరి కొంత మందిని గవర్నింగ్​ బోర్డ్ మెంబర్లుగా నియమించింది. కాగా, ఈ బిల్డింగ్​ పనులను వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్నారు. 8–10 నెలల్లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.