హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2025–26 ఏడాదికి గాను 6 వ తరగతి సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సొసైటీ సెక్రటరీ ఐఏఎస్ సీతాలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 23 ఏకలవ్య స్కూళ్లు ఉండగా, అందులో 6వ తరగతికి సంబంధించి 1,380 సీట్లను భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
అర్హులైన విద్యార్థులు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ... విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం... https://tsemrs.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.