అల్లు అర్జున్ అరెస్ట్‎పై BRS స్టాండ్ ఏంటీ..? అద్దంకి దయాకర్

అల్లు అర్జున్ అరెస్ట్‎పై BRS స్టాండ్ ఏంటీ..? అద్దంకి దయాకర్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‎పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా ప్రాణం పోయింది.. మరో ప్రాణం చావు బతుకుల్లో ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్‎పై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డిది తప్పు అన్నట్లుగా విమర్శలు చేశారు. 

హీరో బాధ్యతారాహిత్యం వల్ల ఒక ప్రాణం పోతే అతడిని అరెస్ట్ చేయొద్దా అని ప్రశ్నించిన అద్దంకి.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తమ స్టాండ్ ఏంటో బీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె కుమారుడు శ్రీ తేజ్‎ను బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కాగా, 2024, డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 

అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు బన్నీ థియేటర్‎కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో థియేటర్‎లో తొక్కిసలాట జరిగి ఫ్యామిలీతో కలిసి మూవీ చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వెంటిలేటర్‎పై చికిత్స పొందుతున్నాడు. బన్నీ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అల్లు అర్జున్‎పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.