దత్తత అంతా ఉత్తదేనంటున్న గ్రామాల జనం!
ఎవరికీ పట్టని దత్తత గ్రామాలు
నెరవేరని ప్రజా ప్రతినిధుల హామీ
ఆసిఫాబాద్,వెలుగు: దత్తత గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్న గ్రామాలు అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు అలానే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఆ గ్రామాలవైపు కనీసం కన్నెత్తి చూడడంలేదు.
ఏం మారలేదు..
సిర్పూర్ (టి) నియోజక వర్గంలోని కౌటాల మండలం హేట్టి గ్రామాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దత్తత తీసుకున్నారు. 685 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పనికాలేదు. మొదట్లో కొన్ని సార్లు స్పెషల్ మీటింగులు పెట్టి సమస్యలు పరిష్కరిస్తామన్న ఆఫీసర్లు తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. గ్రామంలో సరైన మురికి కాలువలు లేవు. వర్షాకాలంలో రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. మంచినీటి సమస్యా అంతే స్థానికులకు ఇంకా బోరుబావి నీళ్లే దిక్కు.
దహేగాం మండలం బీబ్రా గ్రామాన్ని కూడా కోనప్ప దత్తత తీసుకున్నారు. సీసీ రోడ్లు వేయిస్తామని, నాలాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ గ్రామ అభివృద్ధిపై ఊసెత్తలేదు. కనీసం అంతర్గత రోడ్లు వేయలేదు. గ్రామస్తుల్లో ఎవరికీ డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు. మొత్తం 285 కుటుంబాలున్న ఈ గ్రామంలో 60 శాతం మంది దళితులే. ఎమ్మెల్యే దత్తతతో బతుకులు మారుతాయనుకున్న స్థానికుల ఆశలు అడియాశలే అయ్యాయి.
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామాన్ని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ దత్తత తీసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెన, రోడ్డు పనులు పూర్తి చేయిస్తానన్నారు. మౌలిక వసతులు కల్పించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. కానీ ఇప్పటి వరకు వంతెన పూర్తికాలేదు. దీంతో వర్షాకాలంలో స్థానికులు వాగు దాటలేక వాంకిడి మీదుగా వెళ్తున్నారు. సుమారు 20 కిలో మీటర్లు దూరం అయినా భరిస్తున్నారు. వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర టైంలో గ్రామంలో కనీసం అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉంది. వాంకిడి మీదుగా గ్రామానికి చేరుకునే లోపే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో గర్భిణికి పురిటినొప్పులు వస్తే అంబులెన్స్ రాక ,రోడ్డు, రవాణా సౌకర్యం లేక ట్రాక్టర్ పై దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో డెలివరీ అయ్యింది. పుట్టిన బిడ్డ చనిపోయింది. ఇదంతా తెలిసినా ఎమ్మెల్సీ ఇంత వరకు ఆ గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడంలేదు.
ఊరు డెవలప్ చేయలేదు
కౌటల మండలం హేట్టి గ్రామాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దత్తత తీసుకున్నారు. ఊరు డెవలప్ అయితదని ఆశపడ్డం. కానీ నిరాశే మిగిలింది. ఇప్పుడు అసలే పట్టించుకుంటలేరు.–సాయి నాథ్, ఉప సర్పంచ్
పేరుకే దత్తత గ్రామం
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ గుండి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వాగుపై వంతెన లేక జనం ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, రోగులు కష్టాలు పడుతున్నారు.–శెండే దత్తు, మాజీ సర్పంచ్, గుండి గ్రామం