యాదాద్రి శిశు గృహం నుంచి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, బీహార్ వాళ్లకు దత్తత 

  •     పిల్లల పెంపకాన్ని పర్యవేక్షించనున్న 'కారా'
  •     సరిగా చూడకుంటే  కేసులు నమోదు.. తిరిగి శిశు గృహానికి పిల్లలు

యాదాద్రి, వెలుగు: కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాస్​, మాధవి దంపతులకు 20 ఏండ్ల క్రితం పెండ్లి అయింది. వారికి పిల్లలు కలగలేదు..  డాక్టర్లు కూడా ఆ దంపతులకు పిల్లలు పుట్టరని స్పష్టం చేశారు.  పిల్లలు కావాలన్న కోరికతో సెంట్రల్​ అడాప్షన్​ రిసోర్స్​ ఆథారిటీ (కారా)లో దత్తత కోసం నాలుగేండ్ల క్రితం అప్లయ్ చేసుకున్నారు. రూల్స్​ ప్రకారం అప్లికేషన్​ చేసుకున్న దంపతుల్లో సీనియారిటీ ప్రకారం చిన్నారులను దత్తత ఇస్తారు. నాలుగేండ్లు గడిచిన తర్వాత కామారెడ్డికి చెందిన దంపతులు శ్రీనివాస్​, మాధవికి యాదాద్రి జిల్లా భువనగిరిలోని శిశు గృహం నుంచి రెండున్నరేండ్ల దివ్యను శుక్రవారం దత్తత ఇచ్చారు. చిన్నారి దివ్యను తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులందరితో కలిసి దంపతులు వచ్చారు. 

యాదాద్రి జిల్లాలో శిశు గృహం సెప్టెంబర్​ 2022లో ఏర్పాటైంది. ఈ శిశు గృహానికి పుట్టగానే ఆస్పత్రిలో వదిలేసిన చిన్నారితో పాటు తల్లే అమ్మకానికి పెట్టిన చిన్నారి కూడా చేరుకున్నాడు. మూడు నెలల  నుంచి ఏడేండ్ల వయసున్న ఏడుగురు చిన్నారుల్లో మూడు నెలల వయసున్న పాపతో పాటు నలుగురు చిన్నారులను ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, తెలంగాణ (కామారెడ్డి జిల్లా) రాష్ట్రాలకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. 

దత్తత ప్రక్రియ ఇలా

అక్రమంగా దత్తతను అరికట్టడంలో భాగంగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ 1990లో సెంట్రల్​ అడాప్షన్​ రిసోర్స్​ ఆథారిటీ (కారా) ఏర్పాటు చేసింది. దత్తత కోసం 2015 నుంచి ఆన్​లైన్​లో అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించింది. పిల్లలను దత్తతను తీసుకోవాల్సి దంపతులు  CARA.NIC.INలో రూ. 6 వేలు చెల్లించి, తమకు సంబంధించిన ఆదాయ వనరులు సహా పూర్తి వివరాలతో అప్లయ్​ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయ్​ చేసుకున్న వారికి సీనియార్టీ ప్రకారం అవకాశం రాగానే.. అందుబాటులో ఉన్న చిన్నారుల ఫొటోలు, బ్లడ్​ గ్రూప్​ తదితర డిటైల్స్​ను పంపుతారు. తమకు నచ్చిన చిన్నారుల ఫొటోను ఓకే చేస్తూ 48 గంటల్లో దంపతులు ఓకే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్నారి ఉన్న శిశుగృహ పేరుతో రూ. 50 వేలు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం చిన్నారిని దత్తత ఇస్తారు. 

'కారా' ఆరా

చిన్నారిని దత్తత ఇవ్వడంతోనే 'కారా' చేతులు దులుపుకోదు. రెండేండ్ల పాటు పాప పెంపకాన్ని ఆ పరిధిలోని ఐసీడీఎస్​ స్టాఫ్​ ద్వారా ఆరా తీయిస్తారు. ఇందుకోసం నాలుగుసార్లు దత్తత తీసుకున్న కుటుంబాన్ని సందర్శించి ఒక్కో విజిట్​కు రూ. 2 వేల చొప్పున చార్జీ తీసుకుంటారు. విజిట్​ చేసిన ఐసీడీఎస్​ స్టాఫ్​ చిన్నారి పెంపకం, ఆరోగ్యం వంటివి నిశితంగా పరిశీలిస్తారు.
చిన్నారికి భాష సమస్యచిన్నారికి తెలుగు తప్ప మరో భాష రాదు. దత్తత తీసుకున్న దంపతులకు తమిళం మాత్రమే వస్తుంది. స్కూల్లో తెలుగు వచ్చిన టీచర్​తో.. సదరు చిన్నారి..తనకు ఇష్టమైన కూరలను వివరించి.. తల్లితండ్రులకు అవే వండేలా చెప్పాలని కోరింది. చిన్నారి కోరిక ప్రకారం.. టీచర్​ తల్లిదండ్రులకు చెప్పడంతో అవే వంటలను చేయిస్తున్నారని ఐసీడీఎస్ స్టాఫ్​ చెప్పారు. 

చట్ట ప్రకారం దత్తత తీసుకోండి 

అక్రమంగా దత్తత తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. కారా నిబంధనల ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడానికి అప్లయ్​ చేసుకొని తీసుకోవచ్చు. చిన్నారులతో పనులు చేయించుకో వడం, కొట్టడం నేరం. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. - కేవీ కృష్ణవేణి, వెల్ఫేర్​ ఆఫీసర్​, యాదాద్రి జిల్లా