నెహ్రూ జూపార్క్ లో జంతువుల దత్తత

నెహ్రూ జూపార్క్ లో జంతువుల దత్తత

హైదరాబాద్ లో మీరాలం చెరువు పక్కనే 380 ఎకరాల్లో ప్రకృతి ఒడిలో ఉంది నెహ్రూ జులాజికల్  పార్క్ . రంగు రంగుల పక్షులు, ఎన్నో రకాల దేశీయ, విదేశాల జంతువులు ఉన్నాయి. 1963 అక్టోబర్ 6న  ప్రారంభమైన ఈ జంతు ప్రదర్శనశాల... 10యేళ్ళ పాటు సాఫీగానే గడిచింది. ఆ తరువాత  జంతువుల సంఖ్య పెరగడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. 

2002లో వన్యప్రాణుల దత్తత పథకం ప్రవేశ  పెట్టారు. కానీ 2009 వరకు అమలు కాలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో 2010నుంచి అడాప్షన్  స్కీం నెహ్రూ  జూ  పార్క్ లో అమలు చేస్తున్నారు. 2014 వరకు ఈ దత్తత కార్యక్రమం సజావుగానే సాగినా... 2015నుంచి దత్తత తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. 2013-14లో దత్తత ద్వారా జూకు 80 లక్షల రూపాయల ఆదాయం రాగా...  2014-15లో 44 లక్షలకు పడిపోయింది. మళ్ళీ గత  6 నెలల  నుంచి  జూలో వన్యప్రాణుల  దత్తత  పెరుగుతోంది.  

వన్యప్రాణుల దత్తత పథకం ప్రవేశపెట్టినప్పుడు 2019-2020 ఏప్రిల్ వరకు 118 జంతువులను దత్తత తీసుకున్నారు. తెల్ల పులి, చింపాంజీ, సింహం, రామచిలుక.. ఇలా జంతువులు, పక్షులను ఐటీ, ప్రైవేటు సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు జంతువులను  దత్తత తీసుకున్నాయి. దత్తత ద్వారా 49లక్షల  రూపాయలు వచ్చాయి. గడిచిన  మూడు  నెలల్లో  24 జంతువులను దత్తత తీసుకున్నారు. 

 ప్రస్తుతం జిరాఫీ  లేదా ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకోవాలంటే  5 లక్షల రూపాయిలు చెల్లించాలి. సింహం లేదా పులి  ఏడాదికైతే లక్ష, ఆరు  నెలలకు 50వేలు పే చేయాలి. జంతుప్రేమికులు దత్తత తీసుకునే యానిమల్ మెయింటెనెన్స్ ను బట్టి డబ్బులు చెల్లించాలి. జంతువులతో పాటు  ఏ  పక్షులనైన్నా  ఏడాది పాటు దత్తత తీసుకుంటే  25 వేలు జూ అధికారులకు కట్టాలి. పాముల కోసమైతే ఏడాదికి 30 వేలు చెల్లించాలి.  చీత, జాగ్వార్, పాంథర్ అయితే  ఏడాదికి  75వేలు పే చేయాలి.  

పుట్టిన రోజు, పెండ్లి  రోజులు  ఘనంగా  జరుపుకునే  వాళ్ళు... జూ పార్క్ లో సింపుల్ గా సెలబ్రేట్  చేసుకుంటూ.. జంతువులను దత్తత  తీసుకుంటున్నారు. దీంతో జంతువుల నిర్వహణా భారం జూ అధికారులకు కాస్త  తగ్గుతోంది. లాక్ డౌన్ తర్వాత నుంచి  ఇప్పటి దాకా జంతువుల దత్తత  జోరుగా  సాగుతోందంటున్నారు  జూక్యూరీ ఏటార్  రాజేశ్వర్. గతం  కంటే  ఈ 6 నెలల నుంచి జంతు ప్రేమికులకు దత్తతపై అవగాహన పెరిగింది. చిన్నపిల్లలు కూడా తమ కిడ్డీ  బ్యాంక్స్ లో దాచిన డబ్బుతో యానిమల్ అడాప్షన్ కు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.  క్యాష్, చెక్, డీడీ ఇలా అన్నిరకాల పేమెంట్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు.  జంతువులను దత్తత తీసుకుంటే... జూ పార్క్  ఆర్థిక   కష్టాల నుంచి బయట పడే అవకాశముంది. అలాగే జంతువులు, పక్షలకు మంచి ఆహారాన్ని అందించవచ్చంటున్నారు అధికారులు.