- నలుగురికి ఫుడ్‌పాయిజన్
- నెల రోజుల కిందే సీజ్ అయినా.. మారని తీరు
కంటోన్మెంట్, వెలుగు: అల్వాల్ లోతుకుంట లో ఉన్న గ్రిల్‌హౌజ్ హోటల్లో మళ్లీ కల్తీ ఫుడ్ వెలుగు చూసింది. దసరా రోజు ఆ హోటల్లో షవర్మా తిన్న నలుగురికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా రోజు రాత్రి అల్వాల్‌కు చెందిన లోకేశ్, మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన గోవర్దన్రాజు, వర్దిని , బొల్లారం , కంటోన్మెంట్ ఆసుపత్రిలో పనిచేసే శరత్ షవర్మా తిని, ఇంటికివెళ్లాక వారికి విరేచనాలు, వాంతులయ్యాయి.
కుటుంబీకులు వారిని బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం మంగళవారం కోలుకున్నారు. హోటల్లో షవర్మాను నిలువ చేసిన పదార్ధాలతో తయారు చేయడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పారు. షవర్మా , రోల్స్ తయారీకి ఉపయోగించే మాంసం అపరిశుభ్రంగా ఉంటే ఇకోలీ బ్యాక్టీరియా ఫామ్ అయి ఫుడ్ పాయిజనింగ్జరుగుతుందని డాక్టర్లు తెలిపారు.
ఇలాంటి వాటిని తినడం మానేయాలని చెప్తున్నారు. గతంలో కూడా ఈ హోటల్లో షవర్మా , కల్తీ ఆహారం తిని పలువురు ఆసుపత్రి పాలయ్యారు. అధికారులు నెల రోజులు ఈ హోటల్ ను సీజ్ చేశారు.ఇటీవలే రీఓపెన్ అయింది. మళ్లీ ఫుడ్‌పాయిజన్ కావడంతో స్థానికులు ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మికాంత్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు హోటల్లో తనిఖీ చేశారు.
ఆహార పదార్థాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. అలాగే హోటల్‌ను కూడా సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులువెల్లడించారు.