హైదరాబాద్లో కల్తీ కల్తీ...అల్లం వెల్లుల్లి టాప్

  • ఇటీవల కాచిగూడలో 20 వేల లీటర్లు సీజ్ 
  • రెండు తనిఖీల్లోనే దాదాపు 2 టన్నుల అల్లం పేస్ట్ కూడా..
  • వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ నుంచి 3,115 శాంపిల్స్ టెస్ట్ 
  • అందులో 10 శాతం కల్తీ, అత్యంత ప్రమాదకరం 
  • ప్రభుత్వానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నివేదిక

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తినే తిండే కాదు.. తాగే మంచినీళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. బయటకు చెప్పేది బ్రాండ్​ కంపెనీల పేర్లు.. లోపల నీళ్లు చూస్తే మాత్రం నాసిరకం. ఇటీవల ఫుడ్​ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైంది.  అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట మసాలాలు, హోటళ్లలో చెడిపోయిన ఫుడ్​ ఐటమ్స్​ అయితే కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. 

కల్తీ ఫుడ్​లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టుబడింది అల్లం, వెల్లుల్లి పేస్ట్​ అని తేలింది. మసాలాలు, వంట నూనెలు, టీ పొడి, కారం, పాల పదార్థాలు ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. ప్రాణాలకు హాని చేసే సింథటిక్​ ఫుడ్​ కలర్లు వాడటంతోపాటు సిట్రిక్​ యాసిడ్​, కెమికల్స్​ ఉపయోగించి అల్లం పేస్ట్​ను తయారు చేస్తున్నారు.  ఈ మేరకు  ఫుడ్​ సేఫ్టీ అధికారులు తాజాగా ప్రభుత్వానికి రిపోర్ట్​ ఇచ్చారు. దీని ప్రకారం కాచిగూడ ఏరియాలో బ్రిస్లెరి, కెల్వీ బ్రాండ్లతో మంచినీటి బాటిళ్లను ఉత్పత్తి చేస్తున్న యూనిట్​ను అధికారులు తనిఖీ చేశారు. 

అక్కడ ఉన్న నీటిని పరీక్షించగా.. టీడీఎస్​ లెవల్స్​ చాలా తక్కువగా ఉన్నట్లు, నీళ్లు కూడా నాణ్యంగా లేవని  గుర్తించారు. ఆ యూనిట్​తోపాటు అక్కడ నిల్వ ఉన్న 19,268 లీటర్ల బాటిళ్లను కూడా సీజ్​ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి 3,115 శాంపిల్స్​ను సేకరించి, ల్యాబ్స్​లో పరీక్షించారు. శాంపిల్స్​లో అత్యంత ప్రమాదకర కెమికల్స్​ ఉన్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. 

ప్రధానంగా హైదరాబాద్​ నగరంతోపాటు గ్రామాల్లో ఉన్న కిరాణా జనరల్​ స్టోర్స్​లో కల్తీ ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారు. దీంతో కిరాణ షాప్​ యజమానులను ప్రభుత్వం అలర్ట్​ చేయడంతోపాటు అటు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 

మార్కెట్​లో విచ్చలవిడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్​

కల్తీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్​ టాప్లో ఉన్నది. ఆ తర్వాత వంట మసాలాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల కిందటే కాటేదాన్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఏకంగా 1400 కేజీల అల్లం పేస్ట్​ను గుర్తించారు. దీనిని సింథటిక్​ ఫుడ్​ కలర్స్​తో తయారు చేస్తున్నట్టు తేల్చారు. వంద గ్రాముల డబ్బాల దగ్గర నుంచి.. అర కిలో, కిలో వరకు ప్యాక్​ చేసి కిరాణా స్టోర్స్​కు వీటిని సరఫరా చేస్తున్నారు. 

ఏదో ఒక బ్రాండింగ్​ పేరు పెట్టి, వీటిని అమ్ముతున్నారు. ఎక్కువ మార్జిన్​ ఇస్తుండడంతో కిరాణా షాప్​ యజమానులు కూడా వీటినే సేల్​ చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఏ కూర చేయాలన్నా కచ్చితంగా అల్లంవెల్లుల్లి పేస్ట్​ను వినియోగిస్తారు. కల్తీ చేసిన అల్లం పేస్ట్​తోనే వంటలు వండుతున్నారని, దీంతోనే ఎప్పుడు ఎవరు ఏ రోగం బారిన పడుతున్నారనేది కూడా గుర్తించలేకుండాపోతున్నట్టు సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు ' వెలుగు' కు వివరించారు. 11 నెలల కాలంలో దాదాపు 6 వేల టన్నుల అల్లంపేస్ట్​ సీజ్​చేసినట్టు పేర్కొన్నారు.  

వంట మసాలాలు కూడా పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నారు. చికెన్​, మటన్​, సాంబార్​ ఇన్​ స్టాంట్​ మసాలాలు అంటూ ప్యాకెట్ల రూపంలో తీసుకువస్తున్నారు. ఎలాంటి లైసెన్స్​ లేకుండానే 10 లక్షల నాసిరకం మసాల ప్యాకెట్లు ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా సేల్​ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఒకచోట తనిఖీలు చేసి సీజ్​ చేస్తే.. ఇంకోచోట తయారు చేస్తున్నారని, కొన్ని ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా నెట్​వర్క్​ను పెట్టుకుని కల్తీ దందాను నడిపిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

పెరుగుతున్న ఫుడ్​ పాయిజన్​ కేసులు

డబ్ల్యూహెచ్​వో  నివేదిక ప్రకారం కల్తీ  కారణంగా ఇండియాలో ప్రతి ఏటా దాదాపు 10 కోట్ల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందులో  70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం ఆసుపత్రులకు వెళ్తున్నవారిలో 20 శాతం కల్తీ  ఆహారం తిన్న బాధితులే ఉంటున్నారని అంచనా.  తెలంగాణలోనూ కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు తిని అనారోగ్యంతో హాస్పిటల్స్​లో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. 

బయట మార్కెట్​లో కల్తీ ఉత్పత్తులను వంటల్లో వాడటం వల్లే ఇంట్లో తిన్న ఫుడ్​ కూడా పాయిజన్​ అయి ఆసుపత్రుల పాలవుతున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ఫుడ్​ క్వాలిటీ, చెకింగ్​, ఇతరత్రా వంటి అంశాల్లో ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) తెలంగాణకు 35.75 మార్కులే ఇచ్చింది.   రాష్ట్రంలో ప్రస్తుతం ఫుడ్​ సేఫ్టీ ఆన్ వీల్స్​ వాహనాలు 5 ఉన్నాయి. 

మరో 5 కొత్త వాహనాలకు కూడా సాంక్షన్ రావడంతో అందులో 3 వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటికీ తోడు ఇంకో 10 ఫుడ్​ సేఫ్టీ ఆన్​ వీల్స్​ వాహనాలను ఇవ్వాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని టార్గెట్​ పెట్టుకున్నారు. 3 కొత్త ఫుడ్​ టెస్టింగ్​ ల్యాబొరేటరీస్​​ మంజూరయ్యాయి. వీటిని హనుమకొండ, మహబూబ్​నగర్, నిజామాబాద్​ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.

 ప్రతి జిల్లాలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కేవలం వీటితో మాత్రమే కాకుండా కల్తీకి పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటే.. ఇతరులు ఇలాంటివి చేయడానికి ముందుకు వచ్చేందుకు ఆలోచిస్తారని ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు.