
సిద్దిపేటటౌన్, వెలుగు : కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన ఇస్లావత్ గోవింద్ సిద్దిపేటలోని దోభిగల్లీలోని భోగేశ్వర దేవాలయం సమీపంలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా నెయ్యి తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నాడు. ఇతడిపై అనుమానం వచ్చిన స్థానికులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సోమవారం రాత్రి నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేశారు.
రుచి గోల్డ్ నూనె, వనస్పతిని వేడి చేసి, డబ్బాల్లో నింపి నెయ్యి అంటూ ఒక్కో డబ్బాను రూ. 300 నుంచి రూ. 400కు అమ్ముతున్నాడని పోలీసులు గుర్తించారు. 10 లీటర్ల కల్తీ నెయ్యి, డ్రమ్ములు, ఇతర వస్తువులను సీజ్ చేసి, గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు .