హైదరాబాద్: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ హైదరాబాద్లో భారీ మొత్తంలో దొరికింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్పై కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం దాడి చేసింది. నిందితుడు ఇమ్రాన్ సలీం కల్తీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 835 కిలోల కల్తీ అల్లం,వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు.
సిట్రిక్ యాసిడ్, ఐరన్ ప్రెస్ మిషన్, ఎయిర్ గన్ మిషన్, గ్రైండర్ మిషన్, 4,45,385 రూపాయలను విలువ చేసే వస్తువులను సలీం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, ఎక్స్పైరీ అయిపోయిన, ఎలాంటి లేబుల్ లేకుండా హీనా బ్రాండ్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కిరాణా స్టోర్స్, రెస్టారెంట్లు, హోటల్స్కు నిందితుడు సప్లై చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. హైదరాబాద్ నగరంలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ (అక్టోబర్, 2024) బాగోతం వెలుగుచూడటం ఈ నెలలోనే(అక్టోబర్ 24, 2024) రెండోసారి కావడం గమనార్హం.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్లో 12 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎస్వోటీ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. నాంపల్లిలోని అగాపురాకు చెందిన మహమ్మద్ అఫ్తాబ్.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లోని బాలకృష్ణ నగర్లో ప్లాట్ నంబర్ 5లో పదేండ్లుగా ‘న్యూ నేషనల్’ అనే పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. కుళ్లిన ఆలుగడ్డలు, అరటి చెట్టు కాండం, టైటానియం కెమికల్, సిట్రిక్ యాసిడ్ (మోనోహైడ్రేట్) కలిపి పేస్టు తయారు చేసి అమ్ముతున్నాడు.
ALSO READ | ఇలాంటి తిండి తింటే.. చైతన్యపురిలో కొన్ని హోటల్స్ ఇలా చేస్తున్నాయా..?
ఎస్వోటీ పోలీసులు ఇప్పటికే ఇతడిని మూడు సార్లు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తుండడంతో బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాలుగోసారి పట్టబడటంతో మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు అతన్ని అరెస్ట్చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సదరు నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, పీడీ యాక్ట్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.