- మిల్క్ లైఫ్ టైమ్ పెంచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్
- ఒక్కొక్కరు పలుమార్లు అరెస్ట్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో పాలను యథేశ్చగా కల్తీ చేస్తున్నారు. పాలను సేకరిస్తున్న వ్యాపారులు కల్తీ చేసి అమ్ముతున్నారు.ఈ కల్తీ పాలు జనాన్ని రోగాల పాల్జేస్తోంది. దీర్ఘ కాలికంగా ఇదే కొనసాగితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెబుతున్నారు. పాలను కల్తీ చేస్తున్న వారికి నోటీసులు ఇస్తూ కేసులు నమోదు చేస్తున్నా.. దందా ఆగడం లేదు. 50 లీటర్ల పాలను సేకరిస్తే.. వాటిలో పాల పౌడర్, నీటిని కలిపి వందల లీటర్లుగా మార్చేస్తున్నారు. హైదరాబాద్ సరిహద్దుల్లో జిల్లా ఉండడం కారణంగా ఇక్కడి నుంచి హోటల్స్‌కు ఎక్కువగా పాల సరఫరా జరుగుతోంది. ప్రతి రోజు సొంత వెహికల్స్ ద్వారా వేల లీటర్లను సరఫరా చేస్తున్నారు. పాలు చిక్కగా ఉన్నట్టు కనిపించేలా చేసి, డిమాండ్ పెంచుకుంటున్నారు.
దీర్ఘకాలికంగా వాడితే క్యాన్సర్
అసలైన పాలు ఒకరోజులో పగిలిపోతాయి. దీంతో పాల వ్యాపారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. పాలు ఎక్కువ రోజులు నిలువ ఉండేలా కెమికల్స్ వాడుతున్నారు. గాయాలకు పైపూతగా వాడే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ను కల్తీ పాలలో కలుపుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు చెబుతున్నారు. గొంతు సంబంధిత వ్యాధులతో పాటు గాస్ట్రిక్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాలు, పాల ఉత్పత్తులను రెగ్యులర్‌గా వాడితే చివరకు క్యాన్సర్ బారిన పడతారని చెబుతున్నారు.
ఆఫీసర్ల సమన్వయ లోపం.. అరెస్ట్‌లు చేసినా ఆగని దందా
పాలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై ఎస్వోటీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తరచుగా దాడులు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న పాలను హైదరాబాద్‌లోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించిన తర్వాత రిపోర్ట్ రావడానికి నెలల టైం పడుతోంది. ఈలోగా వ్యాపారులు బెయిల్‌పై వచ్చి తిరిగి పాల కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు పాల వ్యాపారులను రెండుమూడు సార్లు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఎస్వోటీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కల్తీని అరికట్టడంలో విఫలవుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
పాల కల్తీ వ్యాపారులకు శిక్ష పడుతుంది
పాలల్లో కల్తీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నం. ఎప్పటికప్పుడు కల్తీకి పాల్పడుతున్న వారిపై నిఘా వేస్తున్నం. పాలను కల్తీ చేస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ల్యాబ్‌కు పంపిస్తున్నం. రిపోర్ట్ రావడానికి కొంత టైం పడుతోంది. ఈలోపు బెయిల్‌పై వస్తున్న వారిలో కొద్ది మంది మళ్లీ పాల బిజినెస్ చేస్తున్నరు. కొంత ఆలస్యమైన కల్తీకి పాల్పడుతున్న వారికి కోర్టులో కచ్చితంగా శిక్ష పడుతుంది.
- ప్రవీణ్, ఎస్వోటీ, భువనగిరి