
తార్నాక, వెలుగు: ‘విజయ తెలంగాణ’ బ్రాండ్ పేరుతో కల్తీ పాల అమ్మకాలు జరుగుతున్నాయని డెయిరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు. విక్రయదారులతో పాటు ప్రజలు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లాలాపేట్‌లోని విజయ డెయిరీ మెయిన్ ఆఫీస్‌లో ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. విజయ బ్రాండ్ లోగోను ప్రైవేట్ డెయిరీలు వాడడం నేరమన్నారు. స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న జిల్లాల పాల యూనియన్లు విజయ బ్రాండ్‌ను వినియోగించుకోవడానికి వీలు లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లా యూనియన్లు విజయ బ్రాండ్‌ను చట్ట విరుద్ధంగా వినియోగించుకుంటున్నాయని, ఈ విషయంపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా రెండు రోజుల కింద మద్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
కర్నూలు జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం, వీఎన్ఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి పరస్పర సహాయ సహకార సంఘం, శ్రీ సాయి దుర్గ ఎంటర్‌ప్రైజెస్, నెల్లూరు జిల్లా పరస్పర సహాయ సహకార పాల ఉత్పత్తి యూనియన్ లిమిటెడ్, ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, విజయ మిల్క్ ప్రొడక్ట్స్‌తో పాటు నార్ముల్ డెయిరీ వంటి సంస్థలు విజయ బ్రాండ్‌ను వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వినియోగదారులు, విక్రేతలు, పంపిణీదారులు విజయ తెలంగాణ పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.