మిర్యాలగూడలో జోరుగా కల్తీ నూనె దందా

  •     రూ.100కు 20 లీటర్లు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు

మిర్యాలగూడ,  వెలుగు:  నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతోంది. పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీస్ సమీపంలోని ఓ వైన్స్​కు అనుబంధంగా ఉన్న పర్మిట్​రూం హోటల్​లో  కల్తీనూనెతో వంటలు చేస్తుండగా కొందరు గమనించి  టూటౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ వెంటనే నూనె ఫొటో కూడా బయటకు వచ్చింది. మార్కెట్​లో ప్రస్తుతం లీటర్ మంచినూనె రూ.150కి పైనే ఉండగా, ఇక్కడి కొన్ని పర్మిట్​ రూమ్​లు,  హోటళ్లలో వాడుతున్న ఆయిల్​ను 20 లీటర్లకు రూ.100 నుంచి రూ.150కే కొంటున్నట్లు తెలుస్తోంది. విషయం బయటకు రావడంతో నిర్వాహకుడు పత్తా లేకుండా పోయాడు. పోలీసులు, ఫుడ్​సేఫ్టీ అధికారులు అతనిని పట్టుకొని విచారిస్తేనే ఇంత తక్కువ ధరకు నూనె ఎక్కడి నుంచి  తెస్తున్నారు? అందులో ఏం కలుపుతున్నారు? అనే విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. 

వాడిన నూనెనే మళ్లీ మళ్లీ..

మిర్యాలగూడ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాపార, వాణిజ్యకలాపాలు పెరగడంతో లెక్కలేనన్ని హోటల్స్, తోపుడు బండ్లు, ఫుడ్ కోర్టులు, వైన్స్​లకు అనుబంధంగా పర్మిట్​ రూములు ఏర్పాటయ్యాయి. రష్యా, ఉక్రెయిన్​ వార్​ మొదలయ్యాక మార్కెట్​లో నూనెలకు షార్టేజ్​ ఏర్పడింది. ప్రముఖ కంపెనీల కుకింగ్​ఆయిల్​ రేట్లు లీటర్​ రూ.200 దాటేశాయి. దీంతో చిన్న, పెద్ద హోటళ్ల నిర్వాహకులకు ఒక్కసారిగా లాభాలు​ తగ్గాయి. ఈ క్రమంలోనే చాలామంది నిర్వాహకులు కల్తీనూనెలపై కన్నేశారు. స్థానికంగా తయారుచేస్తున్నారో, లేదంటే బయట నుంచి తెప్పిస్తున్నారోగానీ  పీపాలకు పీపాలు కల్తీనూనె మిర్యాలగూడ టౌన్​కు సప్లయ్​ అవుతోందనే ఆరోపణలున్నాయి. అలా తెప్పించిన ఆయిల్​తోనే  ఉదయం పూట టిఫిన్లు, సాయంత్రం బజ్జీలు, బొండాలు, చికెన్​, మటన్ ​ఫ్రై, ఎగ్​ఫ్రైడ్ ​రైస్​ లాంటి వంటకాలు చేసి విక్రయిస్తున్నారు. అసలే కల్తీ నూనె కాగా, దానిని పదే పదే వాడుతున్నారు. ఎంతలా అంటే ఒక్కో హోటల్​ ముందు కడాయిలో నల్లగా మాగిన నూనెను చూస్తే అది మంచినూనా? లేదంటే తీసి పడేసిన ఇంజిన్​ఆయిలా? అనే అనుమానం వస్తుంది.  తాజాగా ఎల్ఐసీ ఆఫీస్ సమీపంలోని ఓ వైన్స్​పర్మిట్ ​రూంలో వాటర్ బబుల్​లో ఉంచిన మాగిన నూనెతో వంటకాలు చేస్తున్న విషయాన్ని కొందరు గమనించి మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులకు ఆదివారం  ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో పర్మిట్ ​రూంలోనే పనిచేస్తున్న సప్లయర్​ ఉన్నాడు. సుమారు 20 లీటర్ల వంట నూనె క్యాన్ ఫొటోను పోలీసులకు అందజేశాడు. హోటల్​ నిర్వాహకులు 20 లీటర్ల క్యాన్​ను రూ. 100 నుంచి 150 కే తెప్పిస్తున్నారని చెప్పడంతో పోలీసులు షాక్​ తిన్నారు. ఆదివారం కావడంతో ఆఫీసర్లు అందుబాటులో లేరు. సోమవారం పోలీసులు, ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు రంగంలోకి దిగి, ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

కల్తీ నూనె అని తేలితే క్రిమినల్ కేసుల నమోదు

హోటళ్లు, పర్మిట్​రూంలలో కల్తీ నూనెతో వంటకాలు చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల చండూరులో  కల్తీ నూనె వాడుతున్నట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేసి శాంపిల్స్​ను టెస్టులకు పంపించాం. మిర్యాలగూడ పట్టణం నుంచి ఇప్పటివరకు ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు వస్తే తప్పకుండా తనిఖీలు చేపడుతాం. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, కల్తీ నూనెలపై అనుమానం వస్తే మాకు ఫిర్యాదు చేయాలి.
- స్వాతి, ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​, నల్గొండ జిల్లా