కల్తీని కట్టడి చేయాలి

హైదరాబాద్ ​నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నకిలీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కుళ్లిన అల్లం, వెల్లుల్లి, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన సుమారు 500 కిలోల నకిలీ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేని పరిశ్రమ నిర్వాహకుడు చాలా ఏండ్లుగా కల్తీ దందా చేస్తూ.. ఉత్పత్తులను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో విక్రయిస్తున్నాడు. ఉత్పత్తి ప్రక్రియలో వ్యర్థ జలాలు, ప్రమాదకరమైన రసాయనాలనూ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మనం తినే ప్రతి పదార్థం నుంచి తాగే పాల వరకు అన్నీ కల్తీ అవుతున్నా.. ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. అనేక జబ్బులు రావడానికి కారణం కల్తీ ఆహారం, వాటిల్లోనే విష రసాయనాలు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కల్తీ దందాను ఆపేవారే లుకుండా పోయారు. కీలకమైన ఫుడ్ ఇన్​స్పెక్టర్ల పోస్టుల రిక్రూట్ మెంట్ లేకపోవడంతో ఫుడ్​కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. మార్కెట్ లో దొరికే పాలలో కెమికల్స్ యూరియా, వివిధ రకాల పౌడర్లు ఉంటున్నాయని, ఆవులకు, బర్లకు ఆక్సిటోసిన్ లాంటి ఇంజక్షన్ లు ఇచ్చి పాలు సేకరిస్తున్నారని, అవి తాగటం వల్ల అనారోగ్యంతోపాటు ఆర్గాన్స్ హెచ్చు తగ్గులపై ప్రభావం పడుతున్నట్లు అనేక ఘటనల్లో వెలుగు చూస్తున్నాయి. 

నూనె, నెయ్యి అన్నీ కల్తీ..

మార్కెట్​లో నూనెలను విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. అనేక రకాల రసాయనాలను కలుపుతున్నారు. ఐస్క్రీం, బిస్కెట్లు, కూల్​డ్రింక్​లు బ్రాండెడ్​కంపెనీల కవర్​తో నకిలీవి తయారు చేస్తూ.. కిరాణా దుకాణాలకు వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. కాటేదాన్​లాంటి ప్రాంతాల్లో నెయ్యి, డాల్డా లాంటి వాటిని జంతువుల బొక్కలను ఉపయోగించి తయారు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇక పండ్లను కూడా కార్బైడ్​పౌడర్ వేసి మగ్గబెడుతున్నారు. కొన్ని హోటల్స్ లో మురిగి పోయిన కూరగాయలు, కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీలు వండుతున్నారు. వంటల్లో కూడా కలర్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా ప్రజలు తినే ఆహార పదార్థాలు, వస్తువులు, పండ్లు కల్తీ అవుతుంటే కనిపెట్టే నాథుడే లేకుండా పోయారు. హెల్మెట్ లేకుంటే ప్రమాదం జరుగుతుంది, చనిపోతారు అని హెల్మెట్ తప్పని సరి చేసిన ప్రభుత్వం..  చాటున నిలపడి ఫొటో కొట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు.. ఈ కల్తీ చేసేవారి పైన కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కల్తీ చేసిన వారికి తగిన శిక్ష, జరిమానా వసూలు చేయవచ్చు కదా? ప్రభుత్వం ఇప్పటికైనా అవసరం ఉన్నంత మందిని ఫుడ్ ఇన్​స్పెక్టర్లను వెంటనే నియమిస్తే, ప్రజల ప్రాణాలను కల్తీ నుంచి రక్షించవచ్చు. ఈ విషయంపై ప్రభుత్వం సమీక్ష చేసి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలి.

ఆరోగ్యం నష్టం.. జేబులు ఖాళీ

ఆరోగ్యం కరాబ్ అయి ప్రైవేట్ దావఖానకు పోతే లక్షలు ఖర్చు పెట్టనిదే వైద్యం అందదు. ప్రభుత్వ దవఖానలో తగిన సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నయం కాని రోగాలు, దీర్ఘ కాలిక జబ్బులు వస్తే ఇల్లు గుల్ల. ప్రాణం పోతుంది ఆ కుటుంబం పేదరికంలోకి దిగజారుతుంది. గంజాయి, డ్రగ్స్, లిక్కర్ ఇవి ఇప్పుడు యువతను పీడిస్తున్నాయి. స్కూల్ పిల్లలను మొదలు సినీ నటుల వరకు వీటిని విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. నిఘా వ్యవస్థ విఫలం కావడం ఒక కారణమైతే.. అప్పుడప్పుడు పట్టుకున్న వారి పై పెద్దగా చర్యలు తీసుకోకపోవడం మూలంగా మత్తుపదార్థాలు యువత భవిష్యత్​ను చిత్తు చేస్తున్నాయి. జనాలు ఇలా రోగాల బారిన పడుతుంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఈ రోగాల వల్ల కాసుల పంట పండుతున్నది. పోనీ ప్రైవేట్ ఆస్పత్రులు వేసే చార్జీల పై ప్రభుత్వానికి నియంత్రణ చేసే ఆలోచన ఉందా అంటే అదీ లేదు. ప్రభుత్వ పెద్దలకే కార్పొరేట్​విద్యా సంస్థలు, కార్పొరేట్​హాస్పిటళ్లు ఉంటే.. వాటిని నియంత్రించేవారు ఉంటారని మాత్రం ఎలా ఆశిస్తాం.

- నారగొని ప్రవీణ్ కుమార్,
 ఉచిత విద్య, వైద్య సాధన సమితి