మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పీవోలు, ఏపీవోలకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై మొదటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్న ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పీవోలు, ఏపీవోలకు ఎన్నికల నిర్వహణపై మొదటి శిక్షణ ప్రారంభమైనట్లు తెలిపారు.
సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలకు సంబంధించి తగు సూచనలు చేశామన్నారు. తొలి విడతలో 350 మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీవోలు, ఏపీవోలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, మాస్టర్ ట్రైనర్స్ రాము, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.
ఎన్నికల శిక్షణ కేంద్రం పరిశీలన..
జనగామ అర్బన్: జనగామ ఏబీవీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కేంద్రాన్ని సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పీవోలు, ఏపీవోల పాత్ర కీలకమని, అందరూ శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. ఈ శిక్షణకు నియోజకవర్గం నుంచి 280 మంది పీవోలు, ఏపీవోలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల సిబ్బందికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మొగులప్ప, పీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.