ఐఎన్​ఎస్​ నిర్దేశక్​ సర్వే నౌక

ఐఎన్​ఎస్​ నిర్దేశక్​ సర్వే నౌక

విశాఖపట్టణం నేవల్​ డాక్​యార్డులో ఐఎన్ఎస్​ నిర్దేశక్​ సర్వే నౌకను జాతికి అంకితం చేశారు. కోల్​కతాలోని గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​(జీఆర్​ఎస్​ఈ) నిర్మించిన ఈ నౌక సర్వే వెసెల్​(లార్జ్​) ప్రాజెక్టులో రెండో నౌక. గతంలో 32 ఏండ్లపాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్​ స్థానంలో కొత్త నౌక ఐఎన్ఎస్​ నిర్దేశక్​ రూపుదిద్దుకున్నది. ఈ నౌక తయారీ 2020, డిసెంబర్​ 1న ప్రారంభించగా 2022లో ట్రయల్స్​ పూర్తిచేశారు.   

  • 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌకలో అడ్వాన్స్​డ్​ హైడ్రోగ్రఫీకి చెందిన మల్టీ బీమ్​ ఎకో సౌండర్లు, సైడ్​ స్కాన్​ సోనార్లు, అటానమస్​ అండర్​ వాటర్​ వెహికల్​(ఏయూవీ), రిమోట్​ఆపరేటెడ్​ వెహికల్​(ఆర్ఓవీ) తదితర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.   
  • సముద్రాల్లో మ్యాపింగ్​, నేవిగేషన్, డీప్​ సీ ఆపరేషన్లలో కచ్చితమైన ప్లానింగ్​కు ఇది ఉపయోగపడుతుంది. ప్రమాదకరమైన ప్రాంతాల్లోనే కాకుండా నిషేధించిన జోన్లలోనూ ఇది సర్వే చేసి కచ్చితమైన డేటాను అందిస్తుంది.     
  • సముద్ర అంతర్భాగంలో ఉండిపోయిన శిథిలాలను గుర్తించడంతోపాటు పర్యావరణ అధ్యయనాలు కూడా చేస్తుంది. 
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన సర్వే నౌక ఐఎన్ఎస్​ నిర్దేశక్​ విదేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి సముద్ర రాయబారిగా ఉపయోగపడుతుంది.    
  • ఈ నౌక నిర్మాణంలో నేవీ వార్​షిప్​ డిజైన్​ బ్యూరో, జీఆర్​ఎస్​ఈ, ఎల్​ అండ్​ టీ, సెయిల్, ఐఆర్​ఎస్​తోపాటు పలు ఎస్​ఎస్​ఎంఈలు పాల్గొన్నాయి. 
  • ఐఎన్ఎస్​ నిర్దేశక్​ సర్వే నౌక పొడవు 110 మీటర్లు, బరువు 3800 టన్నులు.   
  • సమర్థవంతమైన పనితీరు కోసం ఇందులో రెండు ఇంజిన్లను అమర్చారు. 
  •   సముద్రంలో 25 రోజులకుపైగా ఈ నౌక పనిచేయగలదు. 18 నాటికల్​ మైళ్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. విస్తృతమైన సర్వేలు, నిరంతర కార్యకలాపాలు నిర్వహించగలిగే సామర్థ్యం ఈ నౌకకు ఉంది.