
డిజిటల్ యుగంలో టెక్నాలజీ వాయువేగంతో పయనిస్తోంది. టెక్నాలజీ మార్పులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఆవిష్కరణలు రేపటికి అవుట్‌డేట్ అవుతున్నాయి. మారుతున్న టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడంతోపాటు నిరంతరం కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం తప్పనిసరి అవుతున్నది.
ప్రతి ఐదేళ్లకు 44 శాతం వరకు టెక్నాలజీ మారుతున్నట్లు ఇటీవల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి 44 శాతం ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పాల్సి వస్తున్నది. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ఉద్యోగుల పని సామర్థ్యం తగ్గుతుంది. నైపుణ్యాలను మూడు రకాలుగా చెపుతారు. నేర్చుకునే సందర్భాల్లో పొరపాట్లు కూడా జరగవచ్చు. నూతన స్కిల్స్ నేర్చుకోవడానికి తగు సమయం, ప్రణాళికలను కేటాయించాలి.
ప్రతి రోజు కనీసం ఒక గంట అప్ స్కిల్లింగ్ కోసం ఉద్యోగులు సాధన చెయ్యాలి. ఉద్యోగంలో ప్రగతికి రెక్కలుగా నైపుణ్యాలు దోహదపడతాయి. నేర్చుకున్న నైపుణ్యాలకు పొడిగింపుగా, నూతన బాధ్యతలు స్వీకరించడానికి, వృత్తిలో పనితనం చూపడానికి అప్ స్కిల్లింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఒకే కంపెనీలో మరో నూతన బాధ్యతను స్వీకరించడానికి అవసరమైన కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమే రీస్కిల్లింగ్ అని అంటారు. రీస్కిల్లింగ్ వల్ల ఉద్యోగంలో పదోన్నతుల వృద్ధితో పాటు ఆధునిక టెక్నాలజీలో కూడా నేర్పరితనం పెరుగుతుంది.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉద్యోగులు తమ ఉద్యోగస్థాయిని పెంచుకోవడం కూడా జరుగుతుంది. నేటి డిజిటల్ మార్కెట్‌లో ఉన్నతంగా నిలవడానికి తగు నైపుణ్యాలు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కనీస అర్హతగా భావిస్తున్నారు. నేటి యువభారతం నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఆకర్షణీయమైన జీతభత్యాలు పొందే అవకాశం లభిస్తుంది.
కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో స్థిరపడటానికి తగు అర్హతలను సాధించడంపై యువత దృష్టి సారించాలి. తద్వారా భారతీయ యువత 2047 నాటికి వికసిత భారత కలలు సాకారం అవుతాయి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి