కవర్ స్టోరీ : సింపుల్‌గా బతికేద్దాం!

కవర్ స్టోరీ : సింపుల్‌గా బతికేద్దాం!

జీవితం అంటే ఎలా ఉండాలి? పెద్ద ఇల్లు, రెండు మూడు కార్లు, ఇలా చిటికేస్తే అలా పనులు అయిపోయేలా చుట్టూరా పనిమనుషులు, మెషిన్లు... ఇలా ఉండాలి అనుకుంటారు కొందరు. కాస్త కష్టపడి నాలుగు డబ్బులు పోగేసుకుంటే చాలు అలాంటి లైఫ్​ గడపడం ఈజీనే. కానీ ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్​గా ఉండేందుకు ట్రై చేసి చూడండి. ముందు కొంచెం కష్టంగా అనిపించినా ఆ తరువాత అందులో దొరికే ఆనందంతో పోల్చుకుంటే మిగతావన్నీ తక్కువే.

సింపుల్​గా బతకాలంటే... లైఫ్‌‌ని చాలా సింప్లిఫై చేసుకోవాలి. తక్కువ తినాలి. తక్కువ వస్తువులను వాడాలి. తక్కువగా ఖర్చుపెట్టాలి. ఇలా ఒకటేంటి చాలావాటినే తగ్గించుకోవాలి. అలా ఉండగలిగితే... అదే సింపుల్‌‌ లైఫ్‌‌. ఇలా బతికితే చాలు మానసిక, శారీరక ఆరోగ్యాలతో పాటు ప్రకృతికి కూడా మేలు చేసినట్టే!

లైఫ్‌‌ బిజీగా, కాంప్లికేటెడ్‌‌గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అంటే కనుక.. మీరు సింపుల్‌‌ లివింగ్‌‌లో లేనట్టే. ఈ పోటీ ప్రపంచంలో బతకాలంటే.. ఎవరైనా ఉరుకులపరుగుల జీవితం గడపాల్సిందే. అందుకే ఈ ప్రశ్నకు చాలామంది దగ్గర నుంచి ‘అవును’ అనే సమాధానం వస్తుంది. మోడర్న్​ లైఫ్‌‌ స్టయిల్‌‌ మనిషిని పుషింగ్‌‌, పుల్లింగ్‌‌ల మధ్య అటూ–ఇటూ నలిపేస్తుంటుంది. ఉదయం నిద్ర లేవగానే హడావిడిగా తయారవాలి. పరుగులు పెడుతూ ఆఫీసులకు వెళ్లాలి. అక్కడ కంప్యూటర్లను పరుగులు పెట్టించాలి.

సాయంత్రం అయ్యాక ఆఫీసు నుంచి బయటపడి మళ్లీ పరుగులుపెడుతూ చీకటి పడ్డాక ఇంటికి వెళ్లాలి. కాస్త తిని పడుకోవాలి. తెల్లవారగానే టేప్​ రికార్డర్​లో క్యాసెట్​ తిప్పి పెట్టినట్టు... మళ్లీ సేమ్​ షెడ్యూల్‌‌ రిపీట్‌‌. ఇండియాలో చాలామంది పరిస్థితి ఇదే. అందుకే.. రకరకాల ఒత్తిడుల నుంచి తప్పించుకునేందుకు, ఒకే చట్రంలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు ఇప్పుడు చాలామంది ‘సింపుల్‌‌గా బతికేస్తాం’ అంటున్నారు.

‘ఇబ్బంది పడుతూ బతుకుతున్నాం. ఇదేం జీవితం అనుకునేవాళ్లందరికీ  ‘సింపుల్‌‌ లివింగ్‌‌’ బెస్ట్ ’ అని సలహా ఇస్తున్నారు లైఫ్​ ఎక్స్‌‌పర్ట్స్‌‌. మరి అలా బతకాలంటే.. మనసును కంట్రోల్‌‌లో పెట్టుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. కొన్ని రకాల ఆశలు వదులుకోవాలి. ఒక్కటేమిటి ఇంకా చాలానే చేయాలి. అలా చేస్తేనే కొన్నాళ్లకు సింపుల్​ లివింగ్​లో మజాని ఎంజాయ్‌‌ చేయగలుగుతారు. అర్థవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. 

చాలా గొప్ప ఆలోచన అది

సింపుల్​గా బతకాలనేది చాలా గొప్ప ఆలోచన అంటుంటారు చాలామంది. ఈ లైఫ్ స్టయిల్‌‌ గురించి ఇప్పటికే చాలామంది చాలారకాలుగా చెప్పారు. అయినప్పటికీ ఇందులో ముఖ్యమైన రూల్స్ రెండు ఉన్నాయి. అవి... “ఆశ తగ్గించుకోవడం.  మెటీరియలిస్టిక్‌‌గా ఉండకపోవడం.” ఇలా ఉండడం అంత సులభం కాదు. అందుకోసం ముందుగా సంపూర్ణంగా జీవించేందుకు ఏం కావాలి? ఏం చేయాలి? ఏం కొనాలి? అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ట్రెడిషన్స్​ పక్కన పెట్టాలి. ఇవన్నీ మొదట్లో కాస్త కష్టంగానే అనిపిస్తాయి. కానీ.. కొన్నాళ్లకు అవే ఇష్టంగా మారతాయి. అందుకు కొన్ని పనులు చేయాలి. అవేంటంటే.. 

ఇంటితోనే మొదలు 

లైఫ్‌‌స్టయిల్‌‌లో మార్పు అనేది ఇంట్లోనే మొదలవుతుంది. కాబట్టి సింపుల్‌‌ లివింగ్‌‌ చిట్కాల్లో మొదటిది కూడా ఇంటితోనే మొదలుపెడదాం. ఇల్లు అంటే రెస్ట్‌‌ తీసుకునే, హ్యాపీగా ఉండే, ఎంటర్‌‌‌‌టైన్‌‌ అయ్యే, కుటుంబంతో హాయిగా గడిపే సురక్షితమైన ప్లేస్‌‌. కాబట్టి ఇల్లు ఎప్పుడూ ఇష్టపడే ప్లేస్‌‌గా ఉండాలి. అలా ఉండాలంటే.. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో అనవసరమైన వస్తువులను పెట్టుకోవద్దు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ ఆరునెలల్లో వాడని వస్తువులు, బట్టలు అన్నింటినీ తీసేయాలి. పాడైన బట్టలు, ఉపయోగించని జిమ్ ఎక్విప్‌‌మెంట్​, టీవీ, వీడియోగేమ్స్​, డ్యామేజ్‌‌ అయిన కారు, బైక్‌‌.. ఇలా ఏవి ఇంట్లోఉన్నా అమ్మేయాలి. లేదంటే.. అవసరం ఉన్న వాళ్లకి ఇచ్చేయాలి. వాడని వాటిని ఇంట్లో అస్సలు ఉంచొద్దు. వీలైనంతవరకు చిన్న ఇంట్లో ఉండేందుకే ట్రై చేయాలి. ఇల్లు అనేది అవసరాలకు సరిపోతే చాలు. చిన్న ఇల్లు అనేది లైఫ్‌‌ని చాలా సింపుల్‌‌గా చేస్తుంది. 

అతి అవసరం లేదు

‘చాప ఉన్నంతవరకే కాళ్లు చాపాలి’ అంటుంటారు పెద్దలు. సింపుల్‌‌గా బతకాలి అనుకునేవాళ్లు దీన్ని అన్నింటిలోనూ పాటించాలి. ఏ ప్రయాణమైనా చిన్న చిన్న అడుగులతోనే మొదలుపెట్టాలి. ఆ చిన్న చిన్న అడుగులే బార్డర్‌‌‌‌ లైన్‌‌ దాటిస్తాయని నమ్మాలి. ఒకేసారి పెద్ద అంగలు వేయాలంటే దెబ్బలు తగలొచ్చు లేదా దారిలో అనుకోని పొరపాట్లు జరగొచ్చు. అందుకే చెప్పేదేంటంటే జీవితంలో జరిగే మార్పులు పశ్చాత్తాపపడేలా ఉండకూడదు. సింపుల్‌‌ లివింగ్ అంటే సమాజానికి దూరంగా బతకడం అనుకుంటారు చాలామంది. అలా కానే కాదు.

సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్లి టెంట్ వేసుకుని ఉండడం అసలే కాదు. సమాజంతో కలిసిమెలిసి ఉంటూనే సింపుల్‌‌గా బతకాలి. కాబట్టి ఆధునిక లైఫ్‌‌స్టయిల్‌‌లో అందుబాటులోకి వచ్చిన ప్రతి సాధనాన్ని అవసరమైనంత మేర సమకూర్చుకోవాలి. వాటిని అవసరమైతే తప్ప వాడకూడదు. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డులనే తీసుకుందాం. సింపుల్‌‌ లైఫ్‌‌ గడపాలంటే వాటిని పూర్తిగా వదిలేయాల్సిన అవసరంలేదు. అవసరమైతే తప్ప వాడకుండా ఉండగలిగితే చాలు. సింపుల్‌‌గా బతుకుదామనే ఉద్దేశంతో వాటికి దూరంగా ఉండాలి అనుకుంటే కొన్ని అత్యవసర సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. 

ఏది ముఖ్యమో తెలుసుకోవాలి

సింపుల్‌‌ లైఫ్‌‌ స్టయిల్‌‌తోనే సింపుల్‌‌ లివింగ్‌‌ అనేది మొదలుపెట్టాలి. ముందుగా జీవితంలో ఏవి ముఖ్యమో తెలుసుకోవాలి. వాడే వస్తువులు, వేసుకునే బట్టల నుంచి ప్రతి దానిలో ఏది కావాలి? ఏది వద్దు? అనే విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవసరం లేని వాటిని తీసేసినప్పుడు జీవితం మీద ఒత్తిడి తగ్గుతూ వస్తుంది.

లైఫ్‌‌స్టయిల్‌‌లో చేసుకోవాల్సిన మార్పుల విషయానికి వస్తే... లైఫ్​స్టయిల్​లో ఏం వద్దు. ఏం కావాలి అనుకుంటున్నారో ఆ విషయాలను ముందుగా లిస్ట్‌‌ చేసుకోవాలి. వాటిని మాత్రమే జీవితంలోకి రానివ్వాలి. అయితే.. ఈ మోడర్న్​ ప్రపంచంలో కొన్నింటిని తప్పనిసరి పరిస్థితుల్లో లైఫ్​స్టయిల్‌‌లో యాడ్‌‌ చేసుకోవాల్సి వస్తుంది. అవి సింపుల్‌‌ లైఫ్‌‌కి ఇబ్బంది కలిగించేవే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వాడాలి. ఉదాహరణకు ల్యాప్‌‌టాప్‌‌ డైలీ లైఫ్‌‌లో అంతగా అవసరం ఉండకపోవచ్చు. కానీ.. రిమోట్​గా పని చేయడంలో ల్యాప్‌‌టాప్‌‌ లాంటివి కావాలి.  

వ్యక్తిగతంగా కూడా...

సింపుల్‌‌ లైఫ్‌‌ కావాలంటే.. అందుకు కావాల్సిన నాలెడ్జ్‌‌, వనరులు ఉండాలి. అవి ఉంటేనే సింపుల్‌‌ లివింగ్‌‌ మొదలుపెట్టాలి. ఉదాహరణకు.. కూరగాయల కోసం సొంత గార్డెన్‌‌ పెంచాలి అనుకుంటే... ముందుగా గార్డెనింగ్​ ఎలా చేయాలి? నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి? ఏ సీజన్‌‌లో ఏ మొక్కలు పెంచాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా గార్డెన్‌‌ పెంచలేరు కదా! కాబట్టి సింపుల్‌‌ లైఫ్‌‌ కావాలంటే.. అందుకు కావాల్సిన విషయాల మీద నాలెడ్జ్‌‌ పెంచుకోవాలి. అలాగే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం తెలుసుకోవాలి.

ముఖ్యంగా అన్ని విషయాల్లో పరిధిలు విధించుకోవడం, ఎవరి కోసం వాళ్లు నిలబడటం నేర్చుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పర్సనల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కోసం కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి. ఫైనాన్సింగ్‌‌ నేర్చుకోవాలి. కావాల్సిన వస్తువులను ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? తెలుసుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి టైం కేటాయించాలి. టైం దొరికినప్పుడు సింపుల్‌‌ లివింగ్‌‌లో సాయపడే అంశాల గురించి తెలుసుకోవాలి. అందుకు సంబంధించిన బ్లాగ్స్​ చదవడం, పాడ్‌‌కాస్ట్‌‌లను చూడటం కోసం కొంత టైం పెట్టుకోవాలి. 

కేబుల్‌‌ కట్‌‌

టీవీ చూడడం, సోషల్‌‌ మీడియాలో వీడియోలు స్క్రోల్‌‌ చేయడం.. ప్రతి మనిషి జీవితంలో డైలీ రొటీన్‌‌లా మారింది. ప్రతి ఒక్కరు సగటున రోజుకు నాలుగ్గంటల టైం ఇలాంటి పనుల కోసమే కేటాయిస్తున్నారు. మరి ఇలాంటి అలవాట్లు ఉంటే.. సింపుల్‌‌ లివింగ్‌‌ సాధ్యం కాదు. కాబట్టి ముందుగా అంతగా అవసరం లేదనుకుంటే ఇంటర్నెట్‌‌ కనెక్షన్‌‌ తీసేయాలి. దానివల్ల రోజులో నాలుగింట ఒక వంతు టైం సేవ్‌‌ చేసుకున్నట్టే. దీనివల్ల  డబ్బు కూడా ఆదా అవుతుంది. 

మార్నింగ్‌‌ రొటీన్‌‌

సింపుల్‌‌గా ఉండే మార్నింగ్‌‌ రొటీన్‌‌ అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ‘ఆటోమెటిక్ మార్నింగ్ రొటీన్‌‌’ని క్రియేట్‌‌ చేసుకోవాలి. అంటే.. ఉదయం లేవగానే జరగాల్సిన అన్ని పనులు ఆటోమెటిక్‌‌గా జరిగిపోవాలి. మార్నింగ్ రొటీన్‌‌లో ఫుడ్‌‌ వండుకోవడం, ఆ రోజు చేయాల్సిన పనులను లిస్ట్ చేసుకోవడం, అంతగా ఇంపార్టెన్స్ లేని పనులను పక్కన పెట్టేయడం, పిల్లలతో కలిసి టిఫిన్ తినడం లాంటివి ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట ఆఫ్‌‌లైన్ లైఫ్‌‌ గడపాలి. మార్నింగ్ రొటీన్‌‌లో ముఖ్యంగా స్ట్రెస్‌‌ని కలిగించే మోడర్న్​ టెక్నాలజీకి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన తిండి మాత్రమే తినాలి. 

సోషల్ మీడియా డిటాక్స్‌‌ 

చాలామంది సోషల్‌‌ మీడియా కోసం సగటున నెలకు 60 గంటలు ఖర్చు చేస్తున్నారు. కొందరికైతే ఇదో వ్యసనంగా మారిపోయింది. స్మార్ట్‌‌ఫోన్ వాడకం ఎంతగా పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేం. అంతేకాదు.. లైఫ్‌‌ని కాంప్లికేట్‌‌గా చేయడంలో ఫోన్‌‌ పాత్ర చాలా పెద్దది. అలాగని ఫోన్ వాడకం ఆపేద్దామంటే కుదరదు. అది చాలా అవసరమైన సాధనం. ఫోన్‌‌ లేకపోతే.. ప్రపంచం నుండి డిస్‌‌కనెక్ట్ అయినట్టే అనిపిస్తుంది. అందుకని దాని వాడకం తగ్గించాలి. సోషల్ మీడియా అకౌంట్స్​ డిలీట్‌‌ చేయాలి. స్మార్ట్‌‌ఫోన్‌‌ల వల్ల ఆందోళన విపరీతంగా పెరిగిందని ఎన్నో స్టడీలు చెప్తున్నాయి.

కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఉద్యోగ రీత్యా సోషల్‌‌ మీడియా వాడాల్సి వచ్చినా దానికోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయించుకోవాలి. లిమిట్​ చేసుకున్న ఆ టైంలోనే వాడాలి. మెదడు, కళ్లకు విశ్రాంతి చాలా అవసరం. వీలైనంత వరకు స్క్రీన్‌‌ టైం తగ్గించి ఆ టైంని మీతో మీరు గడపాలి. ఫోన్‌‌కు వచ్చే నోటిఫికేషన్‌‌ లేదా మెసేజ్‌‌కి వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. 24/7 అందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. ఫోన్​ వాడేందుకు పెట్టుకున్న టైంలోనే రిప్లై ఇవ్వాలి. 

ఇష్టంగా తినాలి 

ప్రతి ముద్దను జాగ్రత్తగా నమిలి, ఇష్టంగా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతి పూట భోజనాన్ని ఆస్వాదించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఫాస్ట్ ఫుడ్ ఎంత త్వరగా తయారుచేస్తారో..  అంతే త్వరగా అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి పోషకాలను ఇచ్చే, రుచికరమైన ఫుడ్‌‌ తినాలి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. అంతేకానీ టైం లేదంటూ గబగబా ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టు చేయొద్దు. సింపుల్‌‌ లివింగ్‌‌ కావాలంటే.. లోకల్​గా దొరికే ఆహారపదార్థాలనే ఎక్కువగా తినాలి. రోజూ రైతు బజారుకు వెళ్లి, కావాల్సిన కూరగాయలు కొనుక్కోవడం అలవాటు చేసుకోవాలి.  

చెస్‌‌ మైండ్‌‌సెట్‌‌

సింపుల్‌‌గా బతకాలంటే.. జీవితాన్ని చెస్ మ్యాచ్‌‌గా చూడటం మొదలుపెట్టాలి! మూడు లేదా నాలుగు అడుగులు ముందుకు ఆలోచించి స్టెప్​ వేయాలి. ఆలోచనలు లేని నిర్ణయాల వల్ల జీవితం కాంప్లికేట్‌‌ అవుతుంది. అలా చేయడం సింపుల్‌‌ లివింగ్‌‌కి విరుద్ధం.  అందుకే ప్రతీది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. సింపుల్​గా బతుకుతున్నాం కదా జీవితం కూడా అంతే సింపుల్​గా సాగిపోతుందిలే అనుకుంటే పొరపాటు. లైఫ్​ జర్నీలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. వాటిని గట్టిగా ఎదుర్కోవాలంటే ముందస్తు ప్లానింగ్​ అవసరం. ప్లానింగ్​ ఉందంటే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా వాటినుంచి తప్పించుకోవచ్చు. ఇదే సింపుల్ లివింగ్‌‌కి ఉన్న సరైన మార్గం. 

బట్టల కుప్పలు వద్దే వద్దు 

సింపుల్‌‌గా బతకాలి అనుకుంటే మినిమల్‌‌ వార్డ్‌‌రోబ్‌‌ ఉంటే చాలు. ఫిజికల్​ ఎసెట్స్​ (భౌతిక ఆస్తులను) ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసుకుని వస్తువులను కొనుక్కోవాలి. డబ్బులు ఉన్నాయని, క్రెడిట్ కార్డ్ ఉందని ఏది పడితే అది కొనకూడదు. పెద్ద బిల్డింగ్‌‌, ఫ్యాన్సీ స్పోర్ట్స్ కార్, బ్యాంక్ బ్యాలెన్స్‌‌... ఇవి ఉంటేనే జీవితాన్ని ఎంజాయ్​ చేస్తారు అనేలా చేస్తుంది ప్రస్తుతం చుట్టూ ఉన్న మెయిన్‌‌ స్ట్రీమ్‌‌ కల్చర్‌‌. కానీ.. సింపుల్‌‌గా బతకడానికి అవేమీ అక్కర్లేదు. వారెన్ బఫెట్ లాంటి కొందరు బిలియనీర్లు కూడా సింపుల్‌‌ లైఫ్​స్టయిల్​నే ఇష్టపడుతున్నారు. వారెన్‌‌ బఫెట్‌‌ బాగా డబ్బు సంపాదించాక కూడా అంతకుముందు ఉన్న తన సొంత ఇంట్లోనే ఉన్నాడు. 

అప్పు చేయడం ఆపేయాలి

‘‘అందరూ అప్పుల్లేకుండా బాగానే బతుకుతున్నారు. నాకే బోలెడన్ని అప్పులు ఉన్నాయి” అని చాలామంది అనుకుంటుంటారు. కానీ.. అది నిజం కాదు. చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. దానికి కారణం వాళ్ల ‘డబ్బు ఖర్చుపెట్టే అలవాట్ల’ని అదుపు చేసుకోలేకపోవడమే. అప్పులతో బతకడం వల్ల చేస్తున్న ఉద్యోగం మీద కూడా ఏవగింపు వస్తోంది ఎక్కువమందికి. అలాగే విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. డబ్బు కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మొదట అప్పులు చేయడం మానేయాలి. ఒకవేళ అప్పులు ఉన్నవాళ్లు సింపుల్‌‌ లివింగ్‌‌ మొదలుపెట్టాలి అనుకుంటే కనుక.. వీలైనంత త్వరగా అప్పుల్ని తీర్చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. 

మెడిటేషన్‌‌ 

సింపుల్‌‌గా బతకడం మొదలుపెట్టగానే అందుకు అనుగుణంగా మైండ్‌‌ని ప్రిపేర్‌‌‌‌ చేసుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేంత బలంగా మనసును తయారుచేసుకోవాలి. అందుకోసం ముఖ్యంగా మెడిటేషన్, మైండ్‌‌ఫుల్‌‌నెస్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయాలి. లేదంటే.. పెయింటింగ్, ఇన్‌‌స్ట్రుమెంట్స్‌‌ ప్లే చేయడం వంటివి చేయొచ్చు. అంతేకాదు.. ఎప్పుడూ హెల్దీగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలా ఉండాలంటే అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. రోజూ వాకింగ్‌‌ చేయాలి. ఎక్సర్​సైజ్​ చేయాలి. శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ ఫిట్‌‌గా ఉండాలి.

‘నో’ చెప్పడం నేర్చుకోవాలి

మొహమాటానికి లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో చాలాసార్లు కొన్ని పనులకి ‘యస్‌‌’ చెప్తుంటారు. కానీ.. సింపుల్‌‌ లివింగ్‌‌లో ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. షాపుల్లో బేరమాడుతున్నప్పుడో, ఫ్రెండ్‌‌ కాఫీ తాగడానికి రమ్మనప్పుడో మొహమాటానికి ‘యస్‌‌’ చెప్తుంటారు చాలామంది. కానీ.. ప్రయోజనం లేని పనులకు కచ్చితంగా ‘నో’ చెప్పాలి. ఏది నిజంగా ముఖ్యమైనదో దానికి మాత్రమే ‘యస్‌‌’ చెప్పాలి. ‘నో’ చెప్పడం అనేది ఒక కండరం(మజిల్​) లాంటిది. ఎలాగైతే మజిల్‌‌ని వాడే కొద్దీ అది బలపడుతుందో.. ‘నో’ చెప్పే ఆర్ట్‌‌ కూడా చెప్తున్న కొద్దీ బలపడుతుంది. 

కృతజ్ఞత ఉండాలి

పెద్ద ఇల్లు, బోలెడన్ని బట్టలు, డబ్బు, చెప్పులు, బూట్లు, ఎక్కువ మంది స్నేహితులు కావాలా? అనే ప్రశ్నలకు సమాధానం ‘అవును’ అయితే.. వెంటనే దాన్ని ‘కాదు’ అని మార్చేయాలి. సింపుల్‌‌గా బతకడం అంటే.. పైన చెప్పుకున్నవన్నీ తగ్గించి బతకడమే.  ఉన్నదాని కంటే ఎక్కువ కోరుకోవడం మానేయాలి. లేనిదాన్ని కావాలి అనుకోవడం కంటే.. ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి.

ప్రకృతికి దగ్గరగా... 

టైం దొరికినప్పుడు సినిమాలకు, పబ్‌‌లకు వెళ్లే బదులు.. నేచర్‌‌‌‌కి దగ్గరగా ఉండాలి. బైక్ రైడింగ్, చేపలు పట్టడం, హైకింగ్ చేయడం, పిక్నిక్‌‌లకు వెళ్లడం లాంటివి చేయొచ్చు. బీచ్‌‌లో నడవడం, రోజుకు ఒక్కసారైనా నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో నడవడం లాంటివి మనుషుల్ని అనవసరమైన ఆలోచనల నుంచి దూరం చేస్తాయి. 

తక్కువ షాపింగ్‌‌

షాపింగ్ చేసేటప్పుడు ‘నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఈ వస్తువు మీద ఖర్చు పెట్టడం ఇప్పటికిప్పుడు అవసరమా? ఇంకెప్పుడైనా కొన్నా పర్వాలేదా? అనేది ఆలోచించుకోవాలి. అప్పటికి తప్పనిసరి అవసరం అంటేనే కొనాలి. 

న్యూట్రిషన్‌‌ కూడా సింపుల్ 

సింపుల్‌‌ లివింగ్‌‌లో బతకడానికి తినాలి. అంతేకానీ తినడానికే బతకకూడదు. కెమికల్స్‌‌తో ప్రాసెస్ చేసిన ఫుడ్‌‌ని పూర్తిగా మానేయాలి. బయటి ఫుడ్​ తినడం తగ్గించాలి. సరైన పోషకాలు లేని ఆహారాలకు బిగ్​ ‘నో’ చెప్పాలి. 

సస్టెయినబుల్ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌

పెద్ద సిటీల్లో ఉండేవాళ్లు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి... సింపుల్‌‌ లివింగ్‌‌లో భాగంగా సస్టెయినబుల్‌‌ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ వాడాలి. ఉదాహరణకు కారులో ఇరవై నిమిషాల్లో వెళ్లే దూరానికి ట్రాఫిక్‌‌ ఉండడం వల్ల ఒక గంట పడుతుంది. అలాంటప్పుడు సైకిల్ మీద వెళ్లొచ్చు. అలా వెళ్లినా కూడా కారులో వెళ్లినంత టైమే పడుతుంది. కాస్త దూరమే వెళ్లాల్సి వస్తే.. నడుస్తూ వెళ్లడం ఇంకా మేలు. 

క్వాలిటీ ముఖ్యం

ఆధునిక ప్రపంచంలో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ.. ఫ్రెండ్స్‌‌ని ఎంచుకునే విషయంలో చాలా తెలివిగా ఉండాలి. కొందరు వ్యక్తులు లోపల ఒకలా, బయటకు ఒకలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తుల పైపై ప్రేమలను నమ్మొద్దు. అలాంటి వాళ్లతో  స్నేహంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ అభిరుచులకు దగ్గరగా ఉండేవాళ్లను, ఇష్టాలను గౌరవించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోవాలి. ఎక్కువ మంది ఫ్రెండ్స్‌‌ ఉండడం కంటే.. ఉన్న కొద్ది మందీ మంచివాళ్లయితే చాలు. అంటే.. స్నేహంలో కూడా క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. అలాగే మీరు అనుకున్న క్వాలిటీలు అన్నీ ఉన్న ఫ్రెండ్స్ దొరికినా కూడా ఆ స్నేహం చుట్టూ కొన్ని పరిధులు సెట్ చేసుకోవాలి. 

ఎన్నో లాభాలు

సాదాసీదాగా బతకడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ.. వాటన్నింటినీ దాటి బతకగలిగితే.. ఆ జీవితం చాలా బాగుంటుంది. ఒకట్రెండు కాదు.. ఈ సింపుల్‌‌ లైఫ్‌‌తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 

ఒత్తిడి తక్కువ 

సింపుల్‌‌ లివింగ్‌‌ వల్ల ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ఒత్తిడి వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయని ఎన్నో స్టడీలు చెప్తున్నాయి. సింపుల్​ లివింగ్​ వల్ల ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవచ్చు. సింపుల్ లివింగ్‌‌లో పనిభారం తగ్గుతుంది. అనవసరమైన వాటికి దూరంగా ఉండొచ్చు. అలా ఉండడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఫుడ్‌‌, మారిన అలవాట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. తక్కువ వస్తువులను కొనడం, అనవసరమైనవి ఇంట్లో ఉంచుకోకపోవడం వల్ల కూడా ఒత్తిడి దూరం అవుతుంది.  

మానసిక భారం ఉండదు

సింపుల్‌‌ లైఫ్‌‌లో మానసిక భారం తగ్గుతుంది. దానివల్ల మానసికంగా ఉండే గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు. కొనసాగించాల్సిన  కట్టుబాట్లు, బాధ్యతలు, పనుల సంఖ్య తగ్గడం వల్ల జీవితం సాఫీగా గడిచిపోతుంది. ఆలోచనలు, భావాలను ప్రాసెస్ చేసేందుకు ఎక్కువ టైం ఉంటుంది. చాలామంది ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవడం, చేయాల్సిన పనుల జాబితాలో ఎక్కువ పనులు ఉండడం వల్ల ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. కానీ.. సింపుల్‌‌ లివింగ్‌‌లో అలాంటి సమస్యలు ఉండవు. దాంతో పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. 

ఆరోగ్య ప్రయోజనాలు

లైఫ్‌‌ని సింపుల్‌‌ చేయడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఇంట్లో ఎక్కువ వస్తువులు లేకపోవడం వల్ల పని తగ్గుతుంది. కారుకు బదులు సైకిల్ వాడడం వల్ల వ్యాయామం చేసినట్లే. పైగా సింపుల్‌‌ లివింగ్‌‌లో కచ్చితంగా ప్రతిరోజూ మెడిటేషన్‌‌ లేదా వ్యాయామం చేస్తుంటారు. కాబట్టి ఆటోమెటిక్​గా హెల్దీగా ఉంటారు. ముఖ్యంగా గుండె పనితీరు, జీర్ణక్రియ బాగుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

మెరుగైన సంబంధాలు

సింపుల్‌‌ లివింగ్‌‌లో చాలా టైం దొరుకుతుంది. కాబట్టి ఆ టైంని ఫ్యామిలీతో స్పెండ్‌‌ చేస్తారు. దానివల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ఇష్టపడే వ్యక్తుల కోసం ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే.. వాళ్ల మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. అంతేకాదు.. ఆ ఖాళీ టైంలో నచ్చిన పని చేసే వీలుంటుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. డాన్స్, సింగింగ్‌‌, పెయింటింగ్‌‌ లాంటివి చేసేవాళ్లకు అందులో నాలెడ్జ్‌‌ పెరుగుతుంది. పైగా ఫోకస్డ్​గా సింగిల్ టాస్క్​ మీద దృష్టి పెట్టడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. 

పర్యావరణం బాగుంటుంది

సింపుల్‌‌గా బతకడం వల్ల మనకే కాదు.. పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్లవుతారు. తినే ఆహారం నుండి నడిపే కార్లు, వేసుకునే బట్టల వరకు కొనే ప్రతీది పర్యావరణంపై ఎఫెక్ట్‌‌ చూపిస్తుంది. అయితే.. సింపుల్‌‌ లైఫ్‌‌లో ఇవన్నీ తగ్గుతాయి. చాలామంది వాళ్లకు కావాల్సిన కూరగాయలను వాళ్లే పండించుకుంటారు. లేదంటే.. లోకల్​గా దొరికే వాటితో సరిపెట్టుకుంటారు.

కాబట్టి సింపుల్‌‌గా బతకడం వల్ల వనరులను తక్కువగా వాడతారు. దానివల్ల పర్యావరణం కాస్త బాగుపడుతుంది. అనవసరమైనవి వాడడం మానేసినప్పుడు వ్యర్థాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కొత్త వాటిని కొనడం కంటే ఉన్నవాటిని రిపేర్ చేసుకోవడం.. లేదంటే డీఐవై క్రాఫ్ట్స్ చేసుకోవడం వల్ల వస్తువుల తయారీ వల్ల అయ్యే కాలుష్యం తగ్గుతుంది. 

మంచి నిద్ర 

కొన్ని సిటీల్లో చాలా ఇండ్లలో రాత్రి12 దాటితేగానీ.. లైట్లు ఆఫ్‌‌ కావు. దానివల్ల ఒత్తిడి పెరగడంతోపాటు క్వాలిటీ స్లీప్‌‌ తగ్గుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అందుకే నిద్ర పట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. సింపుల్‌‌ లివింగ్‌‌లో ఆ సమస్యే ఉండదు. పని ఒత్తిడి, పని భారం తగ్గడం వల్ల ప్రతి రోజూ హ్యాపీగా మంచి నిద్ర పోగలుగుతారు.

ఆర్థిక ప్రయోజనాలు

సింపుల్‌‌గా బతకడం వల్ల కలిగే బెనిఫిట్స్‌‌లో ఇది చాలా ముఖ్యం. మనిషి జీవితంలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే సింపుల్ లివింగ్‌‌లో అవసరమైతేనే డబ్బు ఖర్చు పెడతారు. దానివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. అలా అయ్యే ఆదా భవిష్యత్తు మీద భయం లేకుండా చేస్తుంది. 

నష్టాలేంటి? 

అన్నీ లాభాలే కాదు.. సింపుల్‌‌ లివింగ్‌‌లో నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే.. దీనివల్ల కలిగే లాభాలతో పోల్చితే నష్టాలు చాలా తక్కువ. అంతగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

పిల్లలకు ఇబ్బంది

సింపుల్‌‌ లివింగ్‌‌ని అర్థం చేసుకునే వయసు పిల్లలది కాదు. అందుకని బయటి ప్రపంచంలోని మనుషులను, పద్ధతులను చూసి ఇంట్లో పరిస్థితులను పోల్చినప్పుడు వాళ్లు ఇబ్బంది పడతారు. ఇంట్లో తక్కువ వస్తువులు ఉండాలని చెప్పేదే సింపుల్‌‌ లైఫ్‌‌. కానీ.. ఎక్కువ వస్తువులు కావాలనేదే పిల్లల మనస్తత్వం. ముఖ్యంగా బొమ్మలు, పుస్తకాలు, పుట్టినరోజు బహుమతులు లాంటివి ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. ఆ వస్తువులను దాచిపెడుతుంటారు. వాళ్లు పెరుగుతున్నా కొద్దీ అవి కూడా ఇంటినిండా చేరుతుంటాయి. వాటిని ఎవరికైనా ఇస్తామని లేదా పారేస్తామని తల్లిదండ్రులు అంటే వాళ్లు అస్సలు ఒప్పుకోరు. 

బోరింగ్ వార్డ్‌‌రోబ్ 

తక్కువ బట్టలు కొనాలనే కాన్సెప్ట్‌‌ వల్ల వార్డ్‌‌రోబ్‌‌ పాత బట్టలతో నిండిపోతుంది. లేదంటే.. తక్కువ బట్టలు ఉండడం వల్ల పదే పదే వాటినే వేసుకోవాల్సి వస్తుంది. దాంతో అవి తొందరగా పాడైపోతాయి. పైగా పదే పదే వేస్తుంటే.. బోర్​ కొడుతుంది కూడా. ముఖ్యంగా యూత్‌‌ ఈ పద్ధతిని ఇష్టపడరు. దాంతో ఆన్‌‌లైన్‌‌లో లేదా స్టోర్‌‌లో బట్టలు చూసినప్పుడు వాళ్ల మనసు మాట వినకపోవచ్చు. అందుకనే ఇంట్లో ఒక్కరో ఇద్దరో సింపుల్‌‌ లివింగ్‌‌ ఫాలో అవుతామంటే సాధ్యం కాదు. కుటుంబం అంతా అలా ఉండగలగాలి.

వింతగా చూస్తారు

సింపుల్‌‌ లివింగ్‌‌లో ఇల్లు చిన్నగా ఉంటుంది. ఆ చిన్న ఇంట్లో వస్తువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు దూరపు బంధువులు, స్నేహితులు ఇంటికి వస్తే.. ఈ సింపుల్‌‌ లివింగ్‌‌ స్టయిల్ గురించి వాళ్లకు తెలియక అపార్థం చేసుకోవచ్చు. సమాజంలో కాస్త భిన్నంగా ఉంటే..  వాళ్లను ఎవరైనా వింతగానే చూస్తారు. అలాంటి పరిస్థితులు, మనుషులను నిత్యం ఫేస్​ చేయాల్సి వస్తుంది. 

మినిమలిజం

సింపుల్‌ లివింగ్‌కి చాలా దగ్గరగా ఉండే లైఫ్ స్టయిల్‌ మినిమలిజం. దీనివల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మినిమలిస్టిక్​గా బతికేవాళ్లకు చాలా ఖర్చులు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎందుకంటే.. వాళ్లు అనవసరం అనిపించిన ఏ వస్తువునూ దగ్గర పెట్టుకోరు. అంటే.. మినిమలిస్ట్​ల దగ్గర ఉన్న ప్రతీది ఎంతో కొంత ఉపయోగపడేదే అయి ఉంటుంది. ఈ లైఫ్​ స్టయిల్​ ఫాలో అయ్యేవాళ్లు ఖరీదైన బట్టలు, వస్తువులకు దూరంగా ఉంటారు. 

రెగ్యులర్ షెడ్యూల్, ఎప్పుడో గాని అక్కరకు రాని వస్తువులతో నిండిన అల్మారాలు, బిజీ మైండ్‌, ఎక్కువ ఆస్తులు, బట్టలు.. ఇలాంటివి అన్నీ వదిలేసి సింపుల్​గా బతుకుతారు. ఇలాంటి లైఫ్​స్టయిల్​ అనుసరించడం వల్ల చాలామంది తమలో ఒత్తిడి తగ్గిందని చెప్పారు కూడా.

‌‌నెంబర్ గేమ్‌‌

సింపుల్‌‌ లైఫ్‌‌ అంతా నెంబర్‌‌‌‌ గేమ్‌‌లా అనిపిస్తుంటుంది. ప్రతిదానికి కాలిక్యులేషన్స్ తప్పదు. ఖర్చు పెట్టాలన్నా, తినాలన్నా, ట్రిప్‌‌కి వెళ్లాలన్నా ప్రతీది లెక్క వేసుకోవాల్సిందే.  దాంతోపాటే.. కంపల్సివ్ స్పార్టానిజం అంటే.. నిజంగా ఏది అవసరం అని ప్రశ్నించుకోవడం. అందుకు తగ్గ నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడడం మొదలవుతుంది. ఇది జీవితాన్ని అయోమయానికి గురిచేస్తుంది.

ఉదాహరణకు.. రమేష్‌‌ అనే అతనికి పెయింటింగ్‌‌ అంటే బాగా ఇష్టం. కానీ.. అతను సింపుల్‌‌ లివింగ్‌‌ మొదలుపెట్టాక పెయింటింగ్‌‌ గురించి ఎంత ఆలోచిస్తాడో... అందుకు వాడే బ్రష్‌‌ల సెట్‌‌ గురించి కూడా అంతే ఆలోచిస్తాడు. బ్రష్‌‌లు ఇప్పుడు కొనడం అవసరమా? ఇంకా ఎక్కడైనా తక్కువ ధరకు దొరుకుతాయా? పాత బ్రష్‌‌లను పారేయకుండా వాటితో ఇంకేమైనా చేయొచ్చా? ఈ నెలలో కేటాయించుకున్న బడ్జెట్‌‌లో బ్రష్‌‌లు కొంటే డబ్బు సరిపోతుందా?.. ఇలా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. 

చెప్పులు లేకుండానే.. 

టైటస్ మోరిస్ అమెరికాలోని కెంటకీ స్టేట్‌‌లో ఉండే అప్పలాచియన్ పర్వతాల పరిసరాల్లో ఉంటున్నాడు. అతను కొన్నేండ్ల నుంచి సింపుల్‌‌గా బతికేస్తున్నాడు. చెప్పులు లేకుండానే నడుస్తాడు. పాలు తాగే అలవాటు లేదు. గుడ్లు కూడా తినడు. అతను ఉంటున్న ప్రాంతంలో పండే ప్లాంట్‌‌ బేస్డ్‌‌ ఫుడ్‌‌ మాత్రమే తింటాడు. చాలా తక్కువ డబ్బు ఖర్చు చేస్తాడు. నిజంగా చెప్పాలంటే..

అతని లైఫ్ స్టయిల్‌‌కి అంత పెద్దగా అవసరమే లేదు. టైటస్‌‌ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇదంతా సాధ్యం అవుతుంది. కానీ.. పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి అంటారా? లాస్సే నార్డ్‌‌లండ్ అతని భార్య మరియా డార్ఫ్​, పిల్లలతోపాటు  ఫిన్‌‌లాండ్‌‌లోని ఉత్తర కరేలియా ప్రాంతంలో అచ్చం టైటస్ లాగే బతుకుతున్నాడు. లాస్సే, మరియా కలిసి ఒక స్కూల్ నడుపుతున్నారు. 

మానవ సంబంధాలు తగ్గాయి

‘‘ఆధునిక ప్రపంచంలో సింపుల్‌‌ లైఫ్ కాస్త కష్టమే. అయినా.. ట్రై చేస్తున్నా. నేను 90ల్లో పుట్టా. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే పెరిగా. కార్డ్‌‌లెస్ ఫోన్లు వాడిన తరం మాది. మేం యూత్​గా ఉన్నప్పుడు స్మార్ట్‌‌ఫోన్ల వాడకం మొదలైంది. అప్పటినుంచి మనుషులతో సంబంధాలు తగ్గుతూ వచ్చాయి. మనుషులతో ఎక్కువగా మమేకమై మాట్లాడిన క్షణాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటా. యాప్‌‌లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌‌ఫోన్లు, డిజిటల్ కరెన్సీ ఇవే ప్రపంచం ఇప్పుడు.

అందుకే నేను 2000 సంవత్సరానికి ముందున్న కాలంలో ఎలా ఉన్నానో అలా ఉండాలి అనుకున్నా. సింపుల్‌‌గా బతకాలని నిర్ణయించుకున్నా. అందుకే ముందుగా జీవించడం అంటే ఏంటో తెలుసుకున్నా. భౌతిక ఆస్తుల కంటే అర్థవంతమైన అనుభవాలు, సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకున్నా. అప్పటినుంచి నిరాడంబరంగా బతికేస్తున్నా” అంటోంది కొన్నాళ్ల నుంచి సింపుల్‌‌ లివింగ్‌‌లో ఉన్న సియావో. 

మీకు మీరుగా చేసుకోవాలి

క్రాఫ్టింగ్, గార్డెనింగ్, బేకింగ్.. లాంటి చాలా పనులు మీకు మీరుగా (డీఐవై–డూ ఇట్‌‌ యువర్‌‌‌‌సెల్ఫ్‌‌) చేయడానికి ప్రయత్నించాలి. ఆధునిక ప్రపంచంలో సాదాసీదా జీవితాన్ని గడపాలంటే అధునాతన సాంకేతికత అందించే కొన్ని సర్వీసులు వాడుకోవద్దు. అందుకోసం డీఐవై చాలా అవసరం. అంటే చిన్న క్రాఫ్ట్స్ చేసుకోవడం. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులతో పరికరాలు తయారుచేయడం లాంటివి చేయాలి. డీఐవై ప్రాజెక్ట్‌‌లు లైఫ్‌‌ స్కిల్స్‌‌ కూడా పెంచుతాయి.